Vemulawada: ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగానే రాజన్న ఆలయ అభివృద్ధి: విప్

Vemulawada: వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారమే జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Update: 2026-08-12 17:34 GMT

Vemulawada: ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగానే రాజన్న ఆలయ అభివృద్ధి: విప్

వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.

బుధవారం వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై వివరాలను తెలియజేసేందుకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆది శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనులు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నమూనాలు, ఫొటోలను పీఠాధిపతికి వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం సుమారు 2000 వేల కోట్ల నిధులు కేటాయించారని, గోదావరి పుష్కరాల కోసం 1000 కోట్లు మంజూరు చేశారని స్వామి వారికి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం, మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రెండు వేల కోట్లకు పైచిలుక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు..వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖతో పాటు అధికారులు, ఆలయ అర్చకులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు.

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.250 కోట్ల మేర నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దాదాపు 55 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం గతంలో రూ.50 కోట్లు, అనంతరం రూ.100 కోట్లు, తాజాగా రూ.99.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు.

వేములవాడ ఆలయ గర్భాలయం, మహామండపాన్ని తొలగిస్తున్నారంటూ గత రెండు రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఈ అంశంపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను శృంగేరి పీఠాధిపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం ,మహామండపాన్ని యథావిధి ఉంటుందని తెలిపారు..

1973లో నిర్మించిన ప్రస్తుత శిఖరం, భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకునే అవకాశం ఉండేలా శిలామయంగా శిఖర స్థాయిని మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఆగమ శాస్త్రం, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్దామని శృంగేరి  పీఠాధిపతి సూచించారని చెప్పారు.

ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనివెట్టి మండపాన్ని ఆధునికంగా నిర్మిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. గతంలో రేకుల షెడ్డు ఉన్న ప్రాంతంలో 20 అడుగులు, 24 అడుగుల విభాగాలతో మండప నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ పరిశీలించిన శృంగేరి పీఠాధిపతి పనులు శుభప్రదంగా ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.

ఆలయ అభివృద్ధి పనులకు సుమారు 4.80 లక్షల క్యూబిక్‌ ఫీట్ల శిల అవసరమవుతుందని అధికారులు వివరించినట్లు  తెలిపారు. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా, ఆలయ ప్రాచీనతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా శృంగేరి పీఠాధిపతి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. సనాతన సంప్రదాయాలను, ప్రాచీన దేవాలయాలను పరిరక్షించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలు, శృంగేరి పీఠాధిపతి సూచనలకు అనుగుణంగానే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. గర్భాలయం, మహామండపాన్ని ముట్టేది లేదు. శిఖర స్థాయిని పెంచే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు.

శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్న సందర్భంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పూర్తిగా ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా  శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారు సూచించినట్లు చేపడుతున్నామని దేవాదాయ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం, వేములవాడ దేవస్థానం తరఫున ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధులు, ధార్మిక సలహాదారు గోవింద హరి, జిల్లా కలెక్టర్, వేద పండితులు, ప్రధాన అర్చకులు తదితరులు శృంగేరి పీఠాన్ని సందర్శించి విధుశేఖర భారతి స్వామివారిని కలిశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఆలయ గర్భాలయాన్ని ఎక్కడా మార్చడం, విస్తీర్ణాన్ని పెంచడం, మహామండపాన్ని తొలగించడం లేదా మార్చడం వంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా శిఖర 1973 నిర్మాణం శిలామయంగా ఉండేదని, అనంతరం ఇటుక, సిమెంట్‌తో నిర్మించిన శిఖర భాగాన్ని ప్రస్తుతం చేపడుతున్న ఆలయ అభివృద్ధిలో భాగంగా తిరిగి శిలామయంగా నిర్మించాలని సూచించినట్లు వెల్లడించారు. భక్తులకు దూరం నుంచే శిఖర దర్శనం కలిగేలా శిఖరాన్ని సుమారు నాలుగు అడుగుల మేర పెంచి, ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని స్వామివారు సూచించినట్లు తెలిపారు.

ఆలయ అభివృద్ధి విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శృంగేరి పీఠాధిపతి సూచనలు, ఆగమ శాస్త్ర నిబంధనలను పాటిస్తూ ప్రతి పనిని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి శృంగేరి పీఠం నుంచి లిఖితపూర్వక సూచనలు, శ్రీముఖం కూడా అందనున్న నేపథ్యంలో వాటి ప్రకారమే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

ఆలయ ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించి శృంగేరి దక్షిణామ్నాయ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు భారతీతీర్థ మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వాములను ఆలయ అధికారులు, ప్రతినిధులు దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పీఠాధిపతుల దృష్టికి తీసుకెళ్లి, సందేహాలు మరియు సాంకేతిక అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఆలయ నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై స్వామీజీలు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం శిఖర నిర్మాణం గతంలో ఇటుకలతో నిర్మించబడిన నేపథ్యంలో, శిఖరాన్ని శిలామయంగా నిర్మించడం శ్రేయస్కరమని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు.

ప్రస్తుత గర్భాలయ ప్రాకారం పైన ఉన్న శిఖర స్థాయి నుంచి సుమారు నాలుగు అడుగుల ఎత్తులో శిలామయ శిఖర నిర్మాణం చేపట్టాలని సూచనలు అందినట్లు పేర్కొన్నారు. అయితే స్వామివారి మూలమూర్తులు, గర్భాలయం, మహామండపానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులు జరుగుతాయి. అదేవిధంగా నిర్మాణానికి ముందు సంబంధిత ప్రదేశంలోని భూమి బలం, నిర్మాణ స్థిరత్వం తదితర అంశాలను పూర్తిగా పరిశీలించాలని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు.

శృంగేరి పీఠాధిపతుల సూచనలు, ఆశీస్సులతో వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఆలయ ఇంచార్జీ స్థాన చార్యులు ఉమేష్ శర్మ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పలు అంశాలపై స్పష్టత కోసం శృంగేరి దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధిపతులైన ఉభయ మహాస్వాములను కలిసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు, ఆజ్ఞలు తీసుకున్నట్లు తెలిపారు.

ఆలయ గోపుర శిఖరాన్ని సుమారు 4.5 అడుగుల మేర పెంచి, కలశాన్ని శిలామయంగా నిర్మించే దిశగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో ఇటుకలతో నిర్మించిన గోపుర నిర్మాణానికి భిన్నంగా, ప్రస్తుతం శిలామయ నిర్మాణంతో ఆలయానికి పునర్ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

గర్భాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించడం లేదని, గర్భాలయం యథాతథంగా ఉంటుందని తెలిపారు.. ఈ విషయంలో భక్తులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఆలయ అభివృద్ధి, పునర్ వైభవానికి సంబంధించి శృంగేరి పీఠాధిపతుల ఆజ్ఞ, ఆశీస్సులు తీసుకున్నామని, భక్తుల సంతోషం, ప్రసన్నతే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు.

Tags:    

Similar News