Sircilla: రాజన్న సిరిసిల్లలో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

Update: 2026-08-15 11:50 GMT

Sircilla: రాజన్న సిరిసిల్లలో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు

సిరిసిల్ల: జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా యంత్రాంగం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రగతి నివేదికను వెల్లడించింది. జిల్లాలో పలు రంగాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.390 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆలయ విస్తరణ, రోడ్ల అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం, గుడిచెరువు పార్కు, బద్ది పోచమ్మ ఆలయ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల మరో రూ.99.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చేలా కార్మికులకు భారీ ఆర్డర్లు కేటాయించడంతో వేలాది మందికి ఉపాధి లభిస్తోందని అధికారులు తెలిపారు. నేతన్న పొదుపు, భద్రత పథకాల ద్వారా కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో 9,086 ఇళ్లు మంజూరు కాగా.. 3,759 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, పంటల బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని అధికారులు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.

విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, తాగునీరు, పరిశ్రమలు, యువతకు నైపుణ్య శిక్షణ వంటి రంగాల్లోనూ పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సైబర్ నేరాల నియంత్రణ, మొబైల్ ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు ప్రత్యేక గుర్తింపు సాధించారని అధికారులు తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమం, అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News