Karimnagar: గోడ దూకి పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తిన విద్యార్థులు!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర గురుకుల పాఠశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ జైసింగ్ సస్పెన్షన్, ఇద్దరు సిబ్బంది తొలగింపు.
Karimnagar: గోడ దూకి పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తిన విద్యార్థులు!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. క్రమశిక్షణ పాటించాల్సిన విద్యాసంస్థలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది.
శుక్రవారం రాత్రి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుమారు 20 మంది విద్యార్థులు, 9వ తరగతికి చెందిన 35 మంది విద్యార్థులపై ఒక్కసారిగా దాడికి దిగారు. తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదనే సాకుతో జూనియర్లను చితకబాదారు. ఈ సమయంలో విధుల్లో ఉన్న గెస్ట్ టీచర్ రమేశ్, నైట్ వాచ్‌మెన్ శంకర్ ఘర్షణను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. విద్యార్థులు భయంతో పాఠశాల గోడ దూకి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆశ్రయం పొందారు.
ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం స్కూల్‌కు వచ్చిన ప్రిన్సిపాల్ జైసింగ్, బాధితుల వివరణ తీసుకున్నప్పటికీ బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రజిత, ఎంపీడీవో దమ్మని రాము, ఎంఈవో ప్రభాకర్ రావు, ఎస్సై వంశీకృష్ణ మరియు ఆర్సీవో అంజలి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.
కఠిన చర్యలు:
విచారణ నివేదిక ఆధారంగా రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు:
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ జైసింగ్‌ను సస్పెండ్ చేశారు.
ఘటన సమయంలో అప్రమత్తంగా లేని గెస్ట్ టీచర్ రమేశ్, నైట్ వాచ్‌మెన్ శంకర్‌ను విధుల్లో నుంచి తొలగించారు.