Karimnagar: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో హైఅలర్ట్.. సీపీ కీలక ఆదేశాలు
Karimnagar: అంతరాష్ట్ర సాయుధ ముఠాల ముప్పు నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Karimnagar: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో హైఅలర్ట్.. సీపీ కీలక ఆదేశాలు
Karimnagar: ఇటీవల కాలంలో అంతరాష్ట్ర సాయుధ ముఠాలు బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యంత కట్టుదిట్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల పీఎంజే జ్యువెలర్స్ లో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, కమిషనరేట్ పరిధిలోని అన్ని వ్యాపార, ఆర్థిక సంస్థల యాజమాన్యాలు, సెక్యూరిటీ ఏజెన్సీలు కింది రక్షణ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
సంస్థల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యాష్ కౌంటర్లు, లాకర్ రూములు కవర్ అయ్యేలా హై-రిజల్యూషన్ నైట్ విజన్ సీసీటీవీ కెమెరాలను నిరంతర విద్యుత్ బ్యాకప్‌తో ఏర్పాటు చేసుకోవాలని, వాటి ఫుటేజీని కనీసం 90 రోజుల పాటు భద్రపరచాలని సూచించారు. సమీప పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించబడిన బర్గర్ అలారాలు, పానిక్ బటన్లను అమర్చడంతో పాటు, గుర్తింపు పొందిన శిక్షణ కలిగిన సెక్యూరిటీ గార్డులను (వీలైనంత వరకు సాయుధ సిబ్బందిని) నియమించుకోవాలని స్పష్టం చేశారు.
అలాగే, లోపలి ప్రాంగణంలోకి అనవసరమైన వ్యక్తుల రాకపోకలను నియంత్రించాలని, నగదు లేదా బంగారం రవాణా సమయాల్లో తీవ్ర గోప్యత పాటించాలని, సంస్థల్లో పనిచేసే రెగ్యులర్, తాత్కాలిక సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలని ఆదేశించారు. హెల్మెట్ ధరించి అనవసరంగా లోపలికి వచ్చే వారి పట్ల, పరిసరాల్లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానం వచ్చే వారి పట్ల యాజమాన్యాలు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సాయుధ నేరగాళ్లను నేరుగా ఎదుర్కొని ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా, కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మరోవైపు, అంతరాష్ట్ర ముఠాల కదలికలను అణచివేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతమైన నిఘా చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎం పరిసరాల్లో బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల ద్వారా 24 గంటల నిరంతర పెట్రోలింగ్ ముమ్మరం చేశామన్నారు. నగర ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, జాతీయ రహదారులపై ఆకస్మిక నాకాబందీలు, ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అంతరాష్ట్ర ముఠాలు, చోరీ సొత్తును కొనుగోలు చేసేవారిపై నిఘా ఉంచేందుకు స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారని, పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల పోలీస్ ఏజెన్సీలతో నిరంతరం సమాచారాన్ని పంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని లాడ్జీలు, హోటళ్లు, అద్దె ఇళ్లు మరియు కొత్తగా వలస వచ్చిన అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించి ముమ్మరంగా తనిఖీలు (వెరిఫికేషన్ డ్రైవ్స్) చేస్తున్నామని, పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక సాంకేతిక నిఘా ఉంచామని తెలిపారు.
అంతరాష్ట్ర వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవడంలో ప్రజల, వ్యాపారుల సహకారం ఎంతో కీలకమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా, గుర్తుతెలియని వ్యక్తులు నిఘా వేసినట్లు గమనించినా, లేదా అనుమానాస్పద వాహనాలు నిలిపి ఉంచినా వెంటనే పోలీసులకు లేదా 'డయల్ 100/112' కు సమాచారం అందించి సహకరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల ఆస్తుల రక్షణకు కరీంనగర్ పోలీస్ యంత్రాంగం పూర్తి అంకితభావంతో పనిచేస్తుందని సీపీ స్పష్టం చేశారు.