Karimnagar: లేబర్ కోడ్స్ కార్మికుల మెడకు ఉరితాళ్లు.. కరీంనగర్‌లో సిఐటియు ఆధ్వర్యంలో గెజిట్ ప్రతుల దహనం!

Karimnagar: కరీంనగర్ కోతిరాంపూర్ లో సిఐటియు నిరసన. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లేబర్ కోడ్స్ గెజిట్ ప్రతులను దహనం చేసిన కార్మిక నేతలు.

Update: 2026-05-15 04:17 GMT

Karimnagar: లేబర్ కోడ్స్ కార్మికుల మెడకు ఉరితాళ్లు.. కరీంనగర్‌లో సిఐటియు ఆధ్వర్యంలో గెజిట్ ప్రతుల దహనం!

కరీంనగర్: సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 'లేబర్ కోడ్స్ ఫైనల్ రూల్స్ గెజిట్' ప్రతులను కోతి రాంపూర్ సిఐటియు కార్యాలయం ముందు దహనం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, శ్రామిక వర్గంపై యుద్ధాన్ని మొదలుపెట్టిందని, ఈ 'లేబర్ కోడ్స్' కార్మికుల మెడలకు బిగించిన ఉరితాళ్లేనని అన్నారు. ఎన్నికల వేళ మాయ మాటలతో ప్రజలను వంచించిన పాలకులు, గద్దెనెక్కిన వెంటనే కార్పొరేట్ శక్తుల పాదాల చెంత కార్మిక హక్కులను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు రక్తం చిందించి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినం, కనీస వేతనం, సామాజిక భద్రత వంటి హక్కులను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఉత్పత్తి వర్గాల పై సాగుతున్న ఈ పాశవిక దాడిని సహించేది లేదన్నారు.

చరిత్రలో ఏ రోజూ పాలకులు హక్కులను ఉచితంగా ఇవ్వలేదు. పోరాటాల ద్వారానే మనం వాటిని సాధించుకున్నాం. నేడు మరోసారి ఆ చారిత్రక అవసరం వచ్చింది. దేశంలోని ప్రతి కర్మాగారం ప్రతిఘటన కేంద్రంగా మారాలన్నారు. కార్పొరేట్-కమ్యూనల్ శక్తుల కలయికతో ఏర్పడిన ఈ ప్రభుత్వం, శ్రామికుల శ్రమను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని, ఈ దోపిడీ పాలనను అంతం చేసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, నాయకులు సిహెచ్ భద్రయ్య, గట్టు సతీష్, చల్ల లక్ష్మణ్, ఎం శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, ఏ మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News