Proddatur: ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ వివాదం.. రాచమల్లుకు ప్రవీణ్ కౌంటర్

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ నిర్వహణ, నిధుల వ్యవహారంపై రాజకీయ విమర్శలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.

ప్రొద్దుటూరు వై.ఎం.ఆర్ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ వివాదం 2019లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే మొదలైందని ప్రవీణ్ ఆరోపించారు. ​డీఏడబ్ల్యూ కాలేజీ, ఎస్ఎస్ మాల్ వ్యవహారాల్లో వాటాలు, డబ్బుల వసూళ్లపై మాజీ ఎమ్మెల్యే బహిరంగంగా సమాధానం చెప్పాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.

తాను ఎక్కడికైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు భాష, పద్ధతి పాటించాలని ప్రవీణ్ హితవు పలికారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్యాకేజీలు మాట్లాడుకుని పోరెడ్డి నరసింహ రెడ్డిని ఇబ్బంది పెట్టారని, ప్రజాధనానికి నష్టం కలిగితే తాను కచ్చితంగా పోరాడతానని ఆయన పేర్కొన్నారు.

​జిల్లా కలెక్టర్ పనితీరుపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రవీణ్ ఖండించారు. ప్రస్తుత కడప జిల్లా కలెక్టర్ పరిపాలనలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలను కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించేవారు కాదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు సైతం స్వేచ్ఛగా కలెక్టర్‌ను కలుస్తున్నారని ప్రవీణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు.

Tags: