Typhoon Dolphin China: ప్రకృతి విలయం...ఖాళీ అవుతున్న చైనా

చైనాలో డాల్ఫిన్‌ ధాటికి విలవిల లాడుతోంది. షాంగైతో పాటు పలు ప్రావిన్స్‌లు తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Update: 2026-08-10 06:10 GMT

Typhoon Dolphin China: తూర్పు చైనా తీరాన్ని ప్రాణాంతకమైన 'డాల్ఫిన్' తుఫాను తీవ్రంగా వణికించింది. గంటకు 150 కిలోమీటర్ల భయంకరమైన వేగంతో విరుచుకుపడిన ఈ ప్రచండ తుఫాను కారణంగా చైనా ఆర్థిక రాజధాని షాంఘైతో పాటు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ప్రధాన నగరాలు అతలాకుతలమయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా చైనా అధికారులు ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ప్రజలను వారి నివాసాల నుండి ఖాళీ చేయించి అత్యవసర పునరావాస కేంద్రాలకు తరలించారు.

బీభత్సం రేపిన 'డాల్ఫిన్' ... గణాంకాలు

సాధారణ తుఫానుల కంటే మూడు రెట్లు ఎక్కువ కాలం మనుగడ సాగించిన ఈ 'డాల్ఫిన్' తుఫాను, తీరం దాటడానికి ముందు ఏకంగా 6,000 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. తుఫాను దాటికి షాంఘై నగరంలోనే ఏకంగా 1,400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫుజియాన్ ప్రావిన్స్‌లో డజన్ల కొద్దీ పడవ ప్రయాణాలను, 100కి పైగా తీరప్రాంత నిర్మాణ పనులను నిలిపివేశారు. అంతేకాదు, జెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెన్‌జౌ నగరం నుండి 9,0000 మందిని, తైజౌ నగరం నుండి మరో 3,90,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి 1,000కి పైగా అత్యవసర రక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక, జెజియాంగ్ ప్రాంతంలో రాబోయే రోజుల్లో 250 మిమీ నుండి 500 మిమీ వరకు భారీ వర్షపాతం నమోదుకానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హ్యాంగ్‌జౌ నగరంలో వరద తీవ్రత దృష్ట్యా ప్రజల వాహనాలకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

ఆసియా దేశాలపై పడిన ప్రభావం

చైనాను తాకడానికి ముందు ఈ తుఫాను ఇతర ఆసియా దేశాల్లోనూ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వర్షాలు, వరదల కారణంగా ఫిలిప్పీన్స్‌లో ఎనిమిది మంది మరణించగా, 7,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అంతేకాదు, జపాన్‌లోని ఒకినావా దీవిలో ఈదురుగాలుల దాటికి ఐదురుగు వృద్ధులు గాయపడ్డారు. దీంతో పాటు హాంకాంగ్‌ను తుఫాను గడగడలాడించింది. తుఫానుతో పాటువేడిగాలుల ప్రభావంతో హాంకాంగ్‌లో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 36.9 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. మరోవైపు ఈ ఏడాది తీవ్రమైన ఎల్‌నినో సంవత్సరం కావడంతో పసిఫిక్ మహాసముద్రంలో తుఫానుల తీవ్రత మరింత పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఏఐ నకిలీ వీడియోల కలకలం

తుఫాను విపత్తు సమయంలో చైనా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, నకిలీ వీడియోలు తీవ్రంగా వ్యాపించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి షాంఘైలో ఒక వ్యక్తి భవనం పైనుంచి కిందపడిపోతున్నట్లు నకిలీ వీడియో రూపొందించిన 60 ఏళ్ల వృద్ధుడితో పాటు, తప్పుడు దృశ్యాలను ఎడిట్ చేసి పోస్ట్ చేసిన మరో 32 ఏళ్ల వ్యక్తిని చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం డాల్ఫిన్ తుఫాను తీవ్రత తగ్గి ఉష్ణమండల తుఫానుగా మారింది. అయినప్పటికీ షాండోంగ్, హెనాన్, జెజియాంగ్ తదితర ప్రావిన్సుల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.   

Tags:    

Similar News