Iran Trump Hormuz: అమెరికా దాడి వ్యాఖ్యలపై ఇరాన్ షాకింగ్ రియాక్షన్... అంతా నాటకమే
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు విచిత్రంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బెదిరింపులకు పాల్పడుతూనే చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని చెప్పడంపై ఇరాన్ వ్యంగ్యాస్త్రాలను సంధించింది.
Iran Trump Hormuz: పశ్చిమాసియాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన హోర్ముజ్ జలసంధి మూసివేత, సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరుదేశాల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ముఖ్య చర్చల ప్రతినిధి మహమ్మద్ బాగేర్ గలీబాఫ్ తీవ్రంగా ఖండించారు. అమెరికా అనుసరిస్తున్న తీరును 'థియేటర్ డిప్లమసీ' గా అభివర్ణిస్తూ, బెదిరింపులు, చర్చల నాటకాలతో లబ్ధి పొందలేరని స్పష్టం చేశారు.
బెదిరింపులు-నాటకాలు చెల్లవు... గలీబాఫ్ ఘాటు వ్యాఖ్యలు
సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా గలీబాఫ్ అమెరికా వైఖరిపై నేరుగా విమర్శలు గుప్పించారు. ఒకవైపు భారీ సైనిక దాడులు చేస్తామని బెదిరిస్తూనే, మరోవైపు చర్చలకు సిద్ధమంటూ వాషింగ్టన్ ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బెదిరింపులు, నెరవేర్చని వాగ్దానాలు, అసత్య వార్తలను ఆయుధాలుగా చేసుకోవడం అమెరికా విఫల వ్యూహానికి నిదర్శనమని, ఇరాన్‌కు ఇలాంటి నాటకాలతో పనిలేదని ఆయన తేల్చిచెప్పారు.
ట్రంప్ హెచ్చరికలు ... టెహ్రాన్ తిరస్కరణ
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... హోర్ముజ్ జలసంధిని అత్యంత త్వరగా తెరవకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా టెహ్రాన్ అధికారులతో రెండు దేశాల మధ్య నాణ్యమైన చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఈ వాదనలను తోసిపుచ్చారు. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇరాక్ పర్యటనలో ఉన్నారని స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వ్యాన్స్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, ఇరాన్‌తో చర్చలు కుదరడం అంత సులువు కాదని, ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను పొందే అవకాశం ఇవ్వబోమని ఆయన పునరుద్ఘాటించారు. భిన్నమైన వాదనలు, భిన్నమైన అభిప్రాయాల నడుమ ఇరాన్ అమెరికా మధ్య సంధి కుదురుతుందా అంటే చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరిలో ఎవరూ తగ్గడం లేదు. చెబుతున్న మాటలకు పొంతన లేకుండా పోతున్నదని అంటున్నారు.
స్వదేశీ బలంతో సిద్ధంగా ఉన్నాం ... ఇరాన్ సైన్యం
ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ మజిద్ ఇబ్న్-ఎ-రెజా స్పందిస్తూ... ఇరాన్ సాయుధ దళాలు ఎలాంటి బాహ్య ముప్పునైనా ఎదుర్కొనేందుకు సంపూర్ణ సన్నద్ధతతో ఉన్నాయని వెల్లడించారు. ఇరాన్ సైనిక శక్తి విదేశీ ఆయుధ దిగుమతులపై ఆధారపడి లేదని, దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ సాంకేతికతపై ఆధారపడి ఉందని తెలిపారు. విదేశీ ఆయుధాలపై ఆధారపడే ప్రాంతీయ దేశాల కంటే ఇరాన్ స్వదేశీ రక్షణ సామర్థ్యం ఎంతో శక్తివంతమైనదని, శత్రువుల బలం రోజురోజుకూ క్షీణిస్తోందని ఐఆర్‌ఎన్‌ఏ వార్తా సంస్థ ద్వారా స్పష్టం చేశారు. ప్రపంచ ముడి చమురు, సహజ వాయువుల రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి.