Defense Agreement: మక్కాలో పక్కా డిఫెన్స్ డీల్... భారత్ పాక్‌పై దాడిచేస్తే జరిగే పరిణామాలేంటి?
మధ్యప్రాచ్యంలో సౌదీ, టర్కీ, పాకిస్తాన్ దేశాల మధ్య డిఫెన్స్ డీల్ కుదిరింది. నాటో తరహాలోనే ఒకదేశంపై దాడి జరిగితే మిగతా రెండు దేశాలు సపోర్ట్‌గా నిలవాలని అగ్రిమెంట్‌లో భాగం.
Defense Agreement: పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన వేళ, అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం ప్రపంచంలో అత్యంత కీలకమైన మూడు ప్రధాన దేశాలైన సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీలు పరస్పర రక్షణ కోసం ఒక చారిత్రాత్మక త్రైపాక్షిక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కా వేదికగా కుదిరిన ఈ ఒప్పందాన్ని 'మక్కా జాయింట్ డిటెర్రెన్స్ అగ్రిమెంట్' గా వ్యవహరిస్తున్నారు.
ఒప్పందంలో ఉన్న ప్రధాన అంశాలు
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు పాల్గొని ఈ ఒప్పందాన్ని ఖరారు చేశారు. నాటో తరహాలోనే ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దానిపై సైనిక దాడి జరిగినా, అది తమ ముగ్గురిపై జరిగిన దాడిగా భావించి ఉమ్మడిగా ఎదుర్కొంటాయని ప్రకటించాయి. టర్కీ వద్ద నాటోలోనే రెండవ అతిపెద్ద సైనిక బలం ఉంది. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యధిక చమురు ఎగుమతి చేసే ఆర్థిక శక్త్యంగం కాగా, పాకిస్థాన్ ఏకైక అణు ఆయుధ సంపత్తి కలిగిన ముస్లిం దేశం. ఈ మూడింటి కలయిక ప్రాంతీయంగా భారీ శక్తిగా మారనుంది. అంతేకాదు, అమెరికా ఆయుధ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, టర్కీ రక్షణ పరిశ్రమ సాంకేతికతతో సౌదీలో స్వదేశీ ఆయుధ తయారీని పెంచడం, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.
ఎందుకు ఈ ఒప్పందం? భౌగోళిక సమీకరణాలు
2023 అక్టోబర్ 7న ప్రారంభమైన గాజా యుద్ధం, అనంతర పరిణామాలు, ఇటీవల హోర్ముజ్ జలసంధి మూసివేత, ఇరాన్‌పై జరుగుతున్న దాడుల కారణంగా పశ్చిమాసియా భద్రత తీవ్రంగా దెబ్బతింది. సౌదీలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాలు దాడులు చేస్తుండటంతో, ప్రాంతీయ భద్రత కోసం ఈ దేశాలు ఒకటై కూటమిగా ఏర్పడ్డాయి.
అంతర్జాతీయ స్పందనలు
ఈ రక్షణ ఒప్పందంపై ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్థాన్ సరిహద్దుల పరంగా విభిన్న చర్చలు మొదలయ్యాయి. ఈ ఒప్పందంపై ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయ్ స్పందిస్తూ, "కాగితపు ఒప్పందాలు రక్షణ ఇవ్వవు, విదేశీ శక్తులపై ఆధారపడటం మానాలి" అని ఘాటుగా విమర్శించారు. ఇజ్రాయెల్ దీనిపై అధికారికంగా స్పందించనప్పటికీ, టర్కీ, పాకిస్థాన్‌లు సౌదీతో చేతులు కలపడం వల్ల పశ్చిమాసియాలో సున్నీ దేశాల కూటమి బలపడుతోందని ఆందోళన చెందుతోంది. పాకిస్థాన్ ఈ ఒప్పందంలో భాగమైనప్పటికీ, ఇది ప్రధానంగా మధ్యప్రాచ్య భద్రత, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కుదిరిన ప్రాంతీయ రక్షణ ఒప్పందమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, మూడింటిలో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగిన దాడిగా అభివర్ణించడం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నదానిపై విశ్లేషకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఉగ్రవాదులను అరికట్టేందుకు భారత్ పీవోకే పై దాడి చేస్తే ఈ ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా, టర్కీ దేశాలు సపోర్ట్‌గా వస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి.