Trump-Netanyahu: ట్రంప్‌కు ఇజ్రాయిల్ హెచ్చిరిక...వార్ నేపథ్యం మారుతుందా?
డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇరాన్ యుద్ధ వ్యూహంపై తీవ్ర విభేదాలు వచ్చాయి. గల్ఫ్ దేశాల మాట విని ట్రంప్ దాడులు ఆపగా, ఇజ్రాయిల్ మాత్రం ఒంటరిగానైనా యుద్ధానికి సిద్దమౌతున్నది.
Trump-Netanyahu: అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత ఉత్కంఠ రేపుతోంది ఇరాన్ యుద్ధం. ఇప్పటివరకు ఇరాన్‌ను దెబ్బతీయడంలో ఒకే తాటిపై నడిచినట్లు కనిపించిన అమెరికా, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఇప్పుడు తీవ్రమైన వ్యూహాత్మక విభేదాలు భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య బుధవారం జరిగిన ఒక టెలిఫోన్ సంభాషణ అత్యంత ఉద్రిక్తంగా మారిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్‌పై మంగళవారం జరగాల్సిన కీలక దాడులను ట్రంప్ హఠాత్తుగా నిలిపివేయడమే ఈ గొడవకు ప్రధాన కారణం. ఇరాన్‌కు విరామం ఇస్తే అది మరింత బలం పుంజుకుంటుందని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ట్రంప్ మాత్రం దౌత్యపరమైన ఒప్పందం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, అమెరికా ప్రమేయం లేకుండానే ఇజ్రాయిల్ ఒంటరిగా దాడులకు తెగబడుతుందా? యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? అనే అంశంపై ప్రత్యేక విశ్లేషణ.
ఫోన్ కాల్‌లో ఏం జరిగింది?
అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు గంట పాటు సాగిన ఈ ఫోన్ కాల్ తర్వాత నెతన్యాహు తీవ్ర ఆగ్రహంతో, ఆందోళనతో ఊగిపోయారు. "ఆ కాల్ తర్వాత నెతన్యాహు ఆగ్రహంతో ఊగిపోయాడని" అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు ట్రంప్ తన దాడుల నిర్ణయాన్ని 24 గంటల్లోనే మార్చుకున్నారు. అయితే, దాడులను ఆలస్యం చేయడం చారిత్రక తప్పిదం అవుతుందని, షెడ్యూల్ ప్రకారమే బాంబుల వర్షం కురిపించాలని నెతన్యాహు ట్రంప్‌కు స్పష్టం చేశారు.
ఇరు దేశాల భిన్నమైన లక్ష్యాలు
ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్ దూకుడుగా వెళ్తోంది. గతంలో అమెరికాకు చెప్పకుండానే ఇరాన్‌లోని అత్యంత కీలకమైన 'సౌత్ ఫార్స్' ఆయిల్ ఫీల్డ్‌పై ఇజ్రాయిల్ దాడి చేసి తన ఉద్దేశాన్ని చాటుకుంది. అయితే, అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇప్పుడు భిన్నమైన ఆలోచనలు చేస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి తెరిచే అంశాలపై చర్చల కోసం ఖతార్, పాకిస్తాన్ దేశాలు ఒక శాంతి ప్రతిపాదనను సిద్ధం చేశాయి. ఇరాన్‌తో ముసాయిదా ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ మరో కొన్ని రోజులు సమయం ఇవ్వాలని చూస్తున్నారు. "ఒప్పందం అయినా కుదురుతుంది లేదా గట్టిగా బుద్ధి చెబుతాం" అని ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్ ద్వారా అమెరికాకు సందేశాలు పంపుతున్న ఇరాన్, చర్చలు విజయవంతం కావాలంటే తమ స్తంభింపజేసిన నిధులను విడుదల చేయాలని, అలాగే లెబనాన్‌లో ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపాలని షరతులు విధిస్తోంది.
అమెరికా సహాయం లేకుండా ఇజ్రాయిల్ యుద్ధం చేయగలదా?
ఇజ్రాయిల్ ప్రధాని ఎంత ఒత్తిడి తెస్తున్నా, ట్రంప్ మాత్రం భీష్మించుకునే ఉన్నారు. నెతన్యాహు గురించి ట్రంప్ మాట్లాడుతూ.. "నేను ఏం చెప్తే ఆయన అదే చేస్తాడు" అని విలేకరులతో అనడం ఇక్కడ గమనార్హం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇరాన్ అణు స్థావరాలను శాశ్వతంగా తుడిచిపెట్టడమే ఇజ్రాయిల్ ఏకైక లక్ష్యం. ఒకవేళ ట్రంప్ దౌత్యం పేరుతో కాలయాపన చేస్తే, ఇజ్రాయిల్ అమెరికా అండ లేకుండానే సొంతంగా ఇరాన్‌పై వైమానిక దాడులకు దిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అదే గనుక జరిగితే, పశ్చిమాసియా యుద్ధ రంగం మరింత భీకరంగా మారడం ఖాయం. ఒకవేళ ఇజ్రాయిల్ ఒంటరిగా రంగంలోకి దిగితే...అమెరికా వెనక్కి తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటా బయట ట్రంప్ అపవాదులు మూటకట్టుకుంటున్నాడు. ఇదిలానే కొనసాగితే ఆయన పదవీకాలం పూర్తికాకుండానే దిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.