India Energy Strategy: ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్న భారత్ ఇంధన వ్యూహం
పశ్చిమాసియాలో గత ఫిబ్రవరి చివరి నుండి రాజుకున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి.
India Energy Strategy: పశ్చిమాసియాలో గత ఫిబ్రవరి చివరి నుండి రాజుకున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. క్షిపణుల దాడులు, సముద్రపు గనుల కలకలం, నౌకలపై దాడులు, అమెరికా నావికాదళ దిగ్బంధనం కారణంగా ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదో వంతు బాధ్యత వహించే ‘హోర్ముజ్ జలసంధి’ పూర్తిగా మూతపడింది. తన ముడిచమురు అవసరాల కోసం ఏకంగా 90 శాతం విదేశాలపైనే ఆధారపడే భారతదేశం, ఈ సంక్షోభంలో చిక్కుకుని ఆర్థికంగా కుప్పకూలుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత్ తన అద్భుతమైన ఇంధన వ్యూహంతో చమురు సరఫరాను అత్యంత సమర్థవంతంగా నిలబెట్టుకుంది. అమెరికా, చైనా, జపాన్ దేశాల తరహాలో భారీ వ్యూహాత్మక నిల్వలు లేకపోయినప్పటికీ, భారత్ అనుసరించిన ‘చమురు వైవిధ్యీకరణ’ విధానం చూసి నేడు ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.
ఒక్క వనరుపై ఆధారపడకుండా.. వ్యూహాత్మక మార్పు
హోర్ముజ్ జలసంధి మూతపడటంతో గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా ఇరాక్ నుండి వచ్చే చమురు దిగుమతులు దాదాపు శూన్యానికి పడిపోయాయి. ఏప్రిల్ నాటికి భారత్ ముడిచమురు దిగుమతులు రోజుకు 5.2 మిలియన్ బారెళ్ల నుండి 4.4 మిలియన్ బారెళ్లకు తగ్గాయి. అయినప్పటికీ, దేశంలో ఇంధన కొరత రాకుండా భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలు తమ వ్యూహాన్ని మార్చాయి. అట్లాంటిక్ బేసిన్ దేశాలైన అమెరికా, బ్రెజిల్, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుండి కొనుగోళ్లను వేగవంతం చేశాయి.
ఇంధన రక్షణగా నిలిచిన ‘రష్యా’ చమురు
ఈ సంక్షోభ సమయంలో రష్యా నుంచి వచ్చే చమురు భారత్‌కు కొండంత అండగా నిలిచింది. హోర్ముజ్ జలసంధితో ఎలాంటి సంబంధం లేని బాల్టిక్, పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా రష్యా చమురు సురక్షితంగా భారత్‌కు చేరుతోంది. రికార్డు: మార్చి నుండి రష్యా చమురు దిగుమతులు రోజుకు 1.9 నుండి 2.0 మిలియన్ బారెళ్లకు చేరాయి. మే నెలలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు బారెల్‌కు $100 దాటినప్పటికీ, అమెరికా తాత్కాలికంగా ఆంక్షల మినహాయింపు ఇవ్వడంతో రష్యాకు చెందిన రోస్నెఫ్ట్, లుకోయిల్ కంపెనీల నుండి భారత్ చమురును భారీగా సేకరించింది. ఈ యుద్ధ కాలంలో రష్యా ఒక్కటే భారత్‌కు 140 మిలియన్ బారెళ్లకు పైగా ముడిచమురును సరఫరా చేసి అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 30 నుండి 37 శాతానికి చేరింది.
హోర్మూజ్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు
హోర్ముజ్ జలసంధి మూసుకుపోయినా సౌదీ అరేబియా, యూఏఈల నుండి భారత్‌కు చమురు సరఫరా ఆగలేదు. దీనికోసం భారత్ భౌగోళికంగా సుదూరమైనప్పటికీ సురక్షితమైన ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గాలను ఎంచుకుంది. సౌదీ ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ద్వారా చమురును ఎర్రసముద్ర తీరంలోని 'యాన్బు' ఓడరేవుకు తరలించి, అక్కడి నుండి నౌకల ద్వారా భారత్‌కు తెస్తున్నారు. యూఏఈ హబ్షాన్-ఫుజైరా పైప్‌లైన్ ద్వారా హోర్ముజ్ జలసంధి అవసరం లేకుండా నేరుగా ఒమన్ గల్ఫ్ తీరంలోని 'ఫుజైరా' రేవు నుండి ముడిచమురు భారత తీరానికి చేరుకుంటోంది. అయితే, ఈ ప్రత్యామ్నాయ మార్గాల వల్ల రవాణా సమయం నాలుగు నుంచి పది రోజులు పెరిగి, లాజిస్టిక్స్ ఖర్చులు ఎక్కువవుతున్నప్పటికీ.. ఇంధన భద్రతకు డోకా లేకుండా భారత్ చూసుకోగలిగింది.
వెనిజులా రీ-ఎంట్రీ.. దేశీయంగా డిమాండ్ నియంత్రణ
అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో వెనిజులా ముడిచమురు భారత్‌లోకి భారీగా పునరాగమనం చేసింది. కేవలం ఏప్రిల్, మే నెలల్లోనే అత్యధిక పరిమాణంలో చమురును సరఫరా చేసి, భారత్‌కు చమురు అందిస్తున్న టాప్-5 దేశాల జాబితాలోకి వెనిజులా చేరిపోయింది. ఇక్కడి కాంప్లెక్స్ రిఫైనరీలకు వెనిజులా భారీ రకం చమురు ఎంతో అనుకూలంగా మారింది.
మరోవైపు, అంతర్జాతీయంగా చమురు లభ్యత తగ్గడంతో దేశీయంగా అనవసర వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. నాలుగేళ్ల విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 3.90 చొప్పున పెంచడం ద్వారా డిమాండ్‌ను నియంత్రణలోకి తెస్తోంది. అలాగే, దేశీయ అవసరాల కోసం చమురు నిల్వలను సురక్షితం చేయడానికి, రిఫైనరీలు ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేయకుండా ప్రభుత్వం ‘విండ్‌ఫాల్ గెయిన్స్ టాక్స్’ విధించింది. ప్రస్తుతం దేశం వద్ద వ్యూహాత్మక నిల్వలతో కలిపి దాదాపు 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మార్చుకుంటున్న భారత్ ఇంధన వ్యూహం నిజంగానే ప్రపంచానికి ఒక పాఠమనే చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో భారత్ చమురు వ్యూహం గురించి తెలుసుకోవడం మంచిది.