Qatar Economic Crisis: వార్‌ ఎఫెక్ట్ః కుదేలవుతున్న సంపన్నదేశం

మధ్యప్రాచ్యంలో రేగిన యుద్ధ జ్వాలలు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలలో ఒకటైన ఖతార్‌ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీశాయి.

Update: 2026-05-18 07:09 GMT

Qatar Economic Crisis: మధ్యప్రాచ్యంలో రేగిన యుద్ధ జ్వాలలు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలలో ఒకటైన ఖతార్‌ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇరాన్ యుద్ధం కారణంగా వ్యూహాత్మక 'హార్ముజ్ జలసంధి' గత 50 రోజులకు పైగా పూర్తిగా మూతపడటంతో ఖతార్ లిక్విడ్‌ నేచురల్‌ గ్యాస్‌ ఎగుమతులు స్తంభించిపోయాయి. దీనికి తోడు రస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల వల్ల ఖతార్ ఉత్పాదక సామర్థ్యం 17 శాతం పడిపోయింది. ఫలితంగా ఈ ఏడాది ఖతార్ ఆర్థిక వ్యవస్థ 8.6 శాతం క్షీణించవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. యుద్ధ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఖతార్‌ ఆర్థిక వ్యవస్థే ఓ నిదర్శనం. ఒక్క ఖతార్‌ మాత్రమే కాదు...గల్ప్‌ దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి.

ముత్యాల నుంచి వజ్రాల వరకు...నేడు స్మశానంగా మారిన ఖతార్‌

ఒకప్పుడు ముత్యాల వేటతో సాదాసీదాగా బతికిన ఖతార్, గత 30 ఏళ్లలో తన గ్యాస్ సంపదతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తన దేశ ఆదాయంలో 60 శాతానికి పైగా కేవలం గ్యాస్ ఎగుమతుల ద్వారానే పొందుతోంది. అలాంటి దేశ ఎగుమతుల తలుపులు ఒక్కసారిగా మూతపడ్డాయి. గ్యాస్ రవాణా ఆగిపోవడంతో దోహ, లుసైల్ వంటి ఆధునిక నగరాల్లోని విలాసవంతమైన మాల్స్, హోటళ్లు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. యుద్ధ భయాల వల్ల అంతర్జాతీయ టూరిజం రంగానికి రోజుకు 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ప్రపంచంలో నాణ్యమైన నగరంగా ప్రసిద్ధి పొందిన ఖతార్‌ నగరాలు స్మశానంగా మారుతున్నాయి. విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు సగం కాలిన చితిలా మారుతున్నాయి. గ్యాస్‌ అంటేనే నిప్పుల కుంపటి. అలాంటి కుంపటిపై బాంబులు పడితే దాని వేడి ఏ స్థాయిలో చెప్పడం వర్ణణాతీతం.

భౌగోళిక ఇబ్బందులు

సౌదీ అరేబియా, యూఏఈ వంటి పొరుగు దేశాలకు హార్ముజ్ జలసంధిని దాటకుండా ప్రత్యామ్నాయ పైప్‌లైన్లు ఉన్నాయి. కానీ ఖతార్ భౌగోళికంగా పూర్తిగా ఈ జలసంధిపైనే ఆధారపడటంతో బందీగా మారింది. ఖతార్ తన ఆహార అవసరాల కోసం 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. సముద్ర మార్గం మూతపడటంతో ఇప్పుడు యూరప్, అమెరికా నుండి వచ్చే ఆహార వస్తువులను అత్యంత ఖరీదైన విమాన మార్గాల ద్వారా లేదా సౌదీ అరేబియా మీదుగా ట్రక్కుల ద్వారా రప్పించాల్సి వస్తోంది. ప్రవాస కార్మికులు దేశం విడిచి వెళ్లకుండా ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తూ ధరలను నియంత్రిస్తోంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇరాన్‌ అమెరికా యుద్ధం ఖతార్‌ వంటి దేశాలకు ఓ గుణపాఠం. అవసరమైన వస్తువుల కోసం విదేశాలపై ఆధారపడకూడదని, వీలైతే కృత్రిమ పద్దతుల్లో సొంతంగా తయారు చేసుకోవాలని ఈ యుద్ధం నేర్పించింది. అంతేకాదు, గ్యాస్‌ ఎగుమతులను సముద్రమార్గంతో పాటు పైప్‌లైన్ల ద్వారా కూడా చేసేలా ప్లాన్‌ చేసుకోవాలని ఈ యుద్ధం బోధిస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నదేశంగా పేరొందిన ఖతార్‌ వద్ద బిలియన్ల కొద్ది నిధులు ఉన్నప్పటికీ, హోర్ముజ్‌ జలసంధి మరికొంతకాలంపాటు మూతపడితే... ఆ దేశ ఆర్థిక పునాదులు మరింత బలహీనపడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జలసంధిని గతంలో మాదిరిగా అంతర్జాతీయ షిప్పులు సజావుగా తిరిగేందుకు అనుకూలంగా మారుతుందా అంటే లేదనే అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మరోసారి ఈ ప్రాంతంలో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ఖతార్‌ ఆందోళన చెందుతోంది.   

Tags:    

Similar News