Middle East Tension: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు... అమెరికాతో కలిసి దాడి చేసేందుకు ఇజ్రాయిల్‌ రెడీ

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌ కూడా దాడి చేసేందుకు సిద్దమౌతున్నది.

Update: 2026-05-18 05:49 GMT

Middle East Tension: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్‌ - అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచంలో చమురు సరఫరా దారుణంగా పడిపోయింది. ఈసారి యుద్ధం అంటూ మొదలైతే దాని తీవ్రత మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాగైనా యుద్ధం ఆగిపోతుందని, తిరిగి పూర్వపు రోజులు వస్తాయని అంతా అనుకుంటున్న సమయంలో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇరాన్‌పై అమెరికా చేపట్టబోయే ఎలాంటి సైనిక దాడుల్లోనైనా భాగస్వామి కావడానికి, ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సైన్యం సంపూర్ణంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన కీలక ఫోన్ సంభాషణ తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాలు అత్యున్నత అప్రమత్తతలోకి వెళ్లాయి. దాడి ఎలా చేయాలి... ఇరాన్‌ను కోలుకోకుండా ఎలా దెబ్బతీయాలి అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇజ్రాయిల్‌, అమెరికాలు దాడికి తెగబడితే...దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా దాడులు చేసేందుకు సమాయాత్తమౌతున్నది. తన శక్తులను కూడగట్టుకొని యుద్ధానికి సిద్దమౌతున్నది.

30 నిమిషాల ఫోన్ సంభాషణ – వ్యూహాత్మక అడుగులు

ఇజ్రాయెల్ అధికారిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నెతన్యాహు మధ్య ఆదివారం దాదాపు 30 నిమిషాలకు పైగా సుదీర్ఘ ఫోన్ సంభాషణ జరిగింది. ఇరు దేశాల అధినేతలు ఇరాన్‌తో రాబోయే రోజుల్లో ఎదురయ్యే యుద్ధ పరిస్థితులు, వ్యూహాలపై తీవ్రంగా చర్చించారు. అమెరికా గనుక ఇరాన్‌పై దాడులు ప్రారంభిస్తే, తాము కూడా నేరుగా రంగంలోకి దిగుతామని ఇజ్రాయెల్ భద్రతా విభాగపు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇప్పటికే ఇజ్రాయిల్‌, ఇరాన్‌ దేశాల్లో యుద్ధం కారణంగా భారీ నష్టాలు సంభవించాయి. మరోసారి రణభేరి మోగితే...పరిణామాలు ఊహించని విధంగా ఉండే అవకాశం ఉంటుంది.

హై అలర్ట్‌లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు

ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యాన్ని అప్రమత్తం చేశారు. అమెరికా దాడి చేయబోయే సమయంపై తమకు ముందస్తు సమాచారం అందుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే, ఇరాన్‌పై నేరుగా దాడులు చేయవద్దని, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చైనా వంటి అగ్రదేశాల నుండి అమెరికాపై తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి కూడా పెరుగుతోంది. మరోవైపు, ఇరాన్ ఇంధన రంగాన్ని దెబ్బతీయడం ద్వారా ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నది ఇజ్రాయెల్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. రాబోయే కొన్ని రోజులు మధ్యప్రాచ్య రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి.


హోర్ముజ్‌ జలసంధి మూసివేయడంతో చైనాకు చమురు రవాణా చాలా వరకు తగ్గిపోయింది. ట్రంప్‌ చైనా పర్యటనలో ఇరాన్‌ అంశం కొలిక్కి వస్తుందని అనుకున్నారు. కానీ, ఎటువంటి ప్రకటన చేయలేదు. కేవలం హోర్ముజ్‌ను తెరవాలని, ఇరాన్‌ అణ్వాయుధాల తయారీని వ్యతిరేకిస్తున్నట్టుగా మాత్రమే ప్రకటన వెలువడింది. ముద్ధాన్ని ముగించాలనిగాని, యుద్ధ నష్టాల విషయం కూడా ప్రస్థావనకు రాలేదు. దీంతో మరోసారి ఇరాన్‌పై దాడి చేస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇజ్రాయిల్‌ సైన్యం అప్రమత్తత ప్రకటించడంతో ఏ క్షణంలో అయినా దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇకవేళ ఇప్పుడు ఇరాన్‌పై దాడులు జరిగితే...దాని ప్రభావం నేరుగా చమురుపై పడుతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా సామాన్యుడు మరింత ఇబ్బంది పడవలసి వస్తుంది.

Tags:    

Similar News