India UAE Oil Reserve Deal: ఫలించిన మోదీ వ్యూహంః యూఏఈ భారీ పెట్టుబడులు...భారీ చమురు నిల్వ కేంద్రాల ఏర్పాటు
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరిన వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య వ్యూహం మరోసారి అంతర్జాతీయంగా భారీ విజయాన్ని సాధించింది.
India UAE Oil Reserve Deal: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరిన వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య వ్యూహం మరోసారి అంతర్జాతీయంగా భారీ విజయాన్ని సాధించింది. ఇరాన్ డ్రోన్ దాడుల అనంతరం యూఏఈ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. భారత్‌లో ఏకంగా 5 బిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 42,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు, అలాగే దేశంలో అత్యవసర వినియోగం కోసం 30 మిలియన్ బారెళ్ల ముడి చమురును నిల్వ చేసేందుకు ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందాలు జరిగాయి.
చమురు, గ్యాస్ రంగాల్లో రికార్డు ఒప్పందాలు
భారతదేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటనలో అడుగులు పడ్డాయి. ప్రస్తుతం భారతదేశానికి అవసరమయ్యే ముడి చమురులో 11 శాతం, గ్యాస్ అవసరాల్లో ఏకంగా 40 శాతం ఒక్క యూఏఈ నుంచే దిగుమతి అవుతోంది. భారత వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకాచం, యూఏఈ భారత్‌లో 30 మిలియన్ బారెళ్ల ముడి చమురును నిల్వ చేయనుంది. ముడి చమురు నిల్వలు ఏర్పాటు చేయడమే కాకుండా భవిష్యత్తులో వ్యూహాత్మక గ్యాస్ నిల్వ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ద్వారా దీర్ఘకాలిక ఎల్‌పీజీ సరఫరాకు కూడా ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. దీంతో యూఏఈ నుంచి వచ్చే 11 శాతం ముడి చమురు, 40 శాతం గ్యాస్ ఆగకుండా భారత్‌కు వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించారు.
రూ. 42,000 కోట్ల పెట్టుబడుల విభజన ఇలా
యూఏఈ భారత్‌లో 5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టబోతున్నది. ఇది భారత ఆర్థిక రంగానికి పెద్ద ఊరట అనే చెప్పాలి. ఈ పెట్టుబడులను మూడు విభాగాల్లో పెట్టనున్నది. ఇందులో మొదటిది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇందులో రూ. 8,400 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధి సంయుక్తంగా మౌలిక వసతుల రంగంలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాయి. బ్యాంకింగ్ రంగంలో రూ. 25,200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్.. భారత ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన 'ఆర్‌బీఎల్ బ్యాంక్'లో 3 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో రూ. 8,400 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ.. భారతదేశానికి చెందిన 'సమ్మాన్ క్యాపిటల్' లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇలా మూడు రంగాల్లో యూఏఈ 5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నది.
రక్షణ రంగం - గుజరాత్ అభివృద్ధి
ఈ పర్యటనలో ఆర్థికాంశాలతో పాటు రక్షణ రంగానికి సంబంధించి కీలకమైన 'స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్టనర్‌షిప్' ఫ్రేమ్‌వర్క్‌పై సంతకాలు జరిగాయి. దీని కింద సైనిక శిక్షణ, సైబర్ డిఫెన్స్, సముద్ర భద్రతతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇరు దేశాలు పంచుకోనున్నాయి. అలాగే గుజరాత్‌లోని వాడినార్‌లో భారీ 'షిప్ రిపేర్ క్లస్టర్' ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.
పశ్చిమ ఆసియాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన 'స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్' జలసంధి గుండా రవాణా సురక్షితంగా సాగాలన్నదే భారత్ ఆకాంక్ష అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో యూఏఈకి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ సంక్షోభాల నడుమ భారత్ సాధించిన ఈ దౌత్య విజయం దేశ పారిశ్రామిక రంగానికి కొత్త దిశను చూపించనుంది. యుద్ధ సమయంలో భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు చమురు కొరతలను తగ్గించే దిశగా కొనసాగుతుండటం విశేషం.