Donald Trump : 45 ఏళ్ల నాటి ఒట్టును తీసి గట్టున పెట్టిన ట్రంప్.. చైనా కోసం ట్రంప్ సంచలన నిర్ణయం
Donald Trump : డొనాల్డ్ ట్రంప్ 45 ఏళ్ల తర్వాత చైనా రాజ విందులో మద్యం సేవించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అన్నయ్య మరణం తర్వాత మద్యం ముట్టనన్న ప్రమాణాన్ని జిన్‌పింగ్ కోసం బ్రేక్ చేశారు.
Donald Trump
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన జీవితంలో ఎప్పుడూ చేయని పనిని చైనా పర్యటనలో చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత 45 ఏళ్లుగా తాను పాటిస్తున్న మద్యపాన నిషేధాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం పక్కన పెట్టారు. 1981లో తన అన్నయ్య అతిగా మద్యం సేవించి మరణించడంతో, ట్రంప్ అప్పటి నుంచి మద్యానికి దూరంగా ఉంటానని ప్రమాణం చేశారు. అప్పటి నుంచి బహిరంగంగా ఆయన ఎప్పుడూ మద్యం తాగుతూ కనిపించలేదు. కానీ, చైనాలో జరిగిన తాజా రాజ విందులో ట్రంప్ మద్యం సిప్ చేస్తూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ సోదరుడు ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ 1981లో ఆల్కహాల్ సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన ట్రంప్‌ను ఎంతగానో కలచివేసింది. అప్పటి నుండి ఆయన తన జీవితంలో మద్యాన్ని ముట్టకూడదని నిర్ణయించుకున్నారు. వైట్ హౌస్‌లో ఉన్న సమయంలో కూడా ఆయన ఎప్పుడూ డైట్ కోక్ లేదా వాటర్ మాత్రమే తాగుతూ కనిపించేవారు. కానీ, చైనాలో షీ జిన్‌పింగ్ ఇచ్చిన విందులో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కోసం ట్రంప్ తన పాత నియమాన్ని బ్రేక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వైట్ హౌస్ రిపోర్టర్ జాన్ మైఖేల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
చైనా సంప్రదాయం కోసమేనా?
చైనాలో రాజ విందుల సమయంలో మద్యం సేవించడం అనేది ఒక పురాతన సంప్రదాయం. అక్కడ అతిథులకు ఇచ్చే గౌరవానికి ఇది ఒక చిహ్నంగా భావిస్తారు. గతంలో 2017లో ట్రంప్ చైనా వెళ్లినప్పుడు ఆయన టేబుల్ మీద వైన్ ఉన్నప్పటికీ దాన్ని ముట్టలేదు. కానీ ఈసారి మాత్రం జిన్‌పింగ్‌పై తనకున్న గౌరవానికి చిహ్నంగా ఒక గుక్కెడు మద్యం సేవించారు. దీనిని చైనాలో మిత్రత్వానికి ప్రతీకగా అక్కడి మీడియా అభివర్ణిస్తోంది. అమెరికా, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ ఈ సాహసం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Trump, who does not drink because his older brother died of a drinking problem, takes a sip and toasts President Xi Jinping in a sign of respect pic.twitter.com/NiLl1n9keP
— Jon Michael Raasch (@JMRaasch) May 14, 2026
నోరూరించే మెనూ.. అదిరిపోయే విందు
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ట్రంప్ కోసం చైనా అత్యంత ఖరీదైన, రుచికరమైన వంటకాలను సిద్ధం చేసింది. ఈ విందు మెనూలో టొమాటో సూప్‌లో లాబ్స్టర్ (సముద్రపు రొయ్యలు), క్రిస్పీ బీఫ్ రిబ్స్, ప్రసిద్ధ బీజింగ్ రోస్ట్ డక్, ఆవాల సాస్‌తో వండిన సాల్మన్ చేప వంటి అనేక రకాల మాంసాహార వంటకాలు ఉన్నాయి. వీటితో పాటు డెజర్ట్ కింద తిరమిసు పండ్లు, ఐస్‌క్రీమ్‌లను వడ్డించారు. ఈ విందులో ట్రంప్ పక్కనే జిన్‌పింగ్ కూర్చోగా, చుట్టూ ఇరు దేశాల టాప్ అధికారులు, సలహాదారులు పాల్గొన్నారు.