Sri Lanka Tea Industry: లంక టీ పరిశ్రమపై ఇరాన్‌ వార్‌ ఎఫెక్ట్‌...కంటతడి పెట్టిస్తున్న తేనీరు

ఇరాన్ యుద్ధం కారణంగా శ్రీలంక టీ ఎగుమతులు మార్చి నెలలో 17.3% పడిపోయాయి. ఇరాక్, యూఏఈ దేశాలకు రవాణా నిలిచిపోవడంతో లంకా దేశపు తేయాకు తోటల కార్మికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2026-05-21 06:30 GMT

Sri Lanka Tea Industry: అంతర్జాతీయంగా ఒకచోట రేగే యుద్ధ జ్వాలలు, ఎక్కడో ఉన్న అమాయక శ్రమజీవుల నోటి కూడును ఎలా లాగేస్తాయో చెప్పడానికి నేటి శ్రీలంక పరిస్థితులే నిదర్శనం. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం కారణంగా శ్రీలంకలోని పురాతన, ప్రతిష్టాత్మకమైన టీ పరిశ్రమ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం, అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవడంతో తేయాకు తోటల్లో రక్తాన్ని చెమటగా మార్చే పేద కార్మికులు ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కుకున్నారు. మానవ తప్పిదాల వల్ల ప్రకృతి, సమాజం ఎలా దెబ్బతింటుందో ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే.. ఇది కలియుగ కర్మఫలం అనిపించక మానదు.

కంటతడి పెట్టిస్తున్న కట్టెలపొయ్యి

"ఈ క్లిష్ట పరిస్థితిని మేము తట్టుకోగలమో లేదో అర్థం కావడం లేదు. యుద్ధం గనుక ఇలాగే కొనసాగితే మా బతుకులు మరింత దుర్భరంగా మారుతాయి" అని శ్రీలంకలోని హట్టన్ ప్రాంతానికి చెందిన డంకెల్డ్ టీ ఎస్టేట్ కార్మికురాలు జసింతా మలార్ రాయిటర్స్ వార్తా సంస్థతో తన ఆవేదనను పంచుకున్నారు. యుద్ధం వల్ల పెరిగిన ద్రవ్యోల్బణంతో వంటగ్యాస్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. దీనితో ఆమె తన కుటుంబం కోసం వంట చేయడానికి ఇప్పుడు మళ్లీ పాతకాలపు కట్టెలను ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. ఎగుమతులు తగ్గిపోవడం వల్ల ఎప్పుడు పని ఊడుతుందో తెలియక తోటల్లోని కార్మికుల గుండెల్లో భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది.

సంక్షోభాన్ని కళ్లగట్టే చేదు నిజాలు

శ్రీలంక ఎగుమతుల అభివృద్ధి మండలి విడుదల చేసిన అధికారిక లెక్కలను పరిశీలిస్తే ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏడాది మార్చి నెలలో టీ ఎగుమతుల ద్వారా లభించిన ఆదయాం గతేడాదితో పోలిస్తే 17.3శాతం మేర పడిపోయింది. మొత్తం ఎగుమతుల విలువ 114.75 మిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. శ్రీలంక నుంచి పెద్ద ఎత్తున ఇరాన్‌కు తేయాకు సప్లై అవుతుంది. శ్రీలంకకు ప్రధాన దిగుమతిదారు ఇరాక్‌. అయితే, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇరాక్‌కు ఎగుమతులు తగ్గిపోయాయి. సుమారు 38శాతం తగ్గిపోయినట్టుగా లంక అధికారులు చెబుతున్నారు. ఇరాక్‌తో పాటు యూఏఈకి కూడా శ్రీలంక నుంచి టీ ఎగుమతి అవుతుంది. కానీ, షిప్పింగ్‌ అంతరాయాల వలన సుమారు 93శాతం వరకు షిప్పింగ్‌ నిలిచిపోయినట్టు అధికారులు తెలియజేశారు.

పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం!

"కొంతకాలం వరకు పెరిగిన అదనపు ఖర్చుల భారాన్ని మేమే భరించి వ్యాపారాన్ని నెట్టుకొచ్చాం. కానీ నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు, విపరీతమైన రవాణా వ్యయాలు అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి" అని ప్రముఖ 'డిల్మా సిలోన్ టీ' కంపెనీ చైర్మన్, సీఈఓ దిల్హాన్ ఫెర్నాండో ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ఎగుమతులే వెన్నెముక. శ్రీలంక లాంటి చిన్న దేశానికి టీ పరిశ్రమ అత్యంత కీలకం. అలాంటి రంగం నేడు అంతర్జాతీయ యుద్ధ రాజకీయాల వల్ల దెబ్బతినడం గమనార్హం. ఈ సంక్షోభం ముగిసి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ప్రపంచ దేశాల మధ్య శాంతి కుదరడం ఒక్కటే మార్గం. శ్రీలంక లాంటి దేశాలు ఈ యుద్ధం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వీటి గోడును వినే నాథుడు లేక విలవిలలాడిపోతున్నాయి.  

Tags:    

Similar News