Putin New Strategy: పుతిన్‌ సరికొత్త వ్యూహం... యూరప్‌ దేశాల్లో మొదలైన భయం

బిష్కెక్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు యూరప్‌ దేశాల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు సహకరించే దేశాలపై ఆయన చేసిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Update: 2026-09-03 06:03 GMT

Putin New Strategy: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనలతో యూరప్ దేశాల్లో మరోసారి తీవ్ర ఆందోళన, భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనిక పరికరాలు, ఆయుధాలు అందిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, పుతిన్ కేవలం ఒక్క ముక్కలో “అదొక సైనిక రహస్యం” అంటూ సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్య బ్రిటన్ ప్రతినిధులను, శత్రు వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అవునని గానీ, కాదని గానీ స్పష్టత ఇవ్వకుండా పుతిన్ ప్రయోగించిన ఈ మానసిక వ్యూహం బ్రిటన్‌పై మానసిక ఒత్తిడి తెచ్చేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

సైనిక రహస్యం వెనుక మానసిక హెచ్చరిక

పుతిన్ వ్యాఖ్యలు బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్హామ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని హెచ్చరించేలా ఉన్నాయి. రష్యా పత్రికల్లో సైతం "బ్రిటన్ నేతలు రష్యాను కలలో కాదు, పీడకలల్లో చూడాల్సి వస్తుంది" అని విమర్శలు రావడం ఈ ఉద్రిక్తతకు ఆజ్యం పోస్తోంది. బ్రిటన్ సైనిక స్థావరాలపై దాడులు తక్షణమే జరుగుతాయని కాకపోయినా, రష్యా ప్రణాళికలు ఏ క్షణంలోనైనా మారవచ్చనే సంకేతాన్ని పంపడమే దీని ముఖ్య ఉద్దేశం.

యూరప్‌లో రష్యా హైబ్రిడ్ ఆపరేషన్లు

ఇటీవల జర్మనీలోని లైప్‌జిగ్ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడి వెనుక రష్యా ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. జర్మనీ హోం మంత్రి అలెగ్జాండర్ డోబ్రిండ్ట్ దీనిని యూరప్‌లో రష్యా సాగిస్తున్న "హైబ్రిడ్ వ్యూహం"గా అభివర్ణించారు. ఇటువంటి అనుమానాస్పద చర్యలు, విధ్వంసకర యత్నాలు రాబోయే రోజుల్లో ఇతర యూరప్ దేశాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉందనే భయాలు వ్యక్తుమవుతున్నాయి.

పాశ్చాత్య దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు

బిష్కెక్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పుతిన్ సుమారు 45 నిమిషాల పాటు పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు. పాశ్చాత్య దేశాలను "సొరచేపలు"గా సంబోధిస్తూ, రష్యాను మింగేయాలని చూస్తే పళ్ళు రాలగొడతామని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. దాదాపు నాలుగేళ్లన్నర కంటే ఎక్కువ కాలంగా సాగుతున్న ఈ యుద్ధంలో తీవ్ర నష్టాలు ఎదురైనప్పటికీ, శత్రు దేశాలు లొంగిపోక తప్పదని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక పుతిన్‌ శాంతి ఒప్పందంపై కూడా స్పందించారు. అమెరికా మాజీ ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌లతో కలిసి చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే అది రష్యా విధించే షరతులకు లోబడి మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే... యుద్ధం అనుకున్న సమయం కంటే సుదీర్ఘంగా సాగుతున్నప్పటికీ, పుతిన్ మాత్రం తన పట్టు సడలించడం లేదు. ఒకవైపు సైనిక చర్యలు, మరోవైపు మానసిక భయాందోళనలు సృష్టిస్తూ యూరప్ దేశాల మద్దతును దెబ్బతీయడమే రష్యా ప్రస్తుత వ్యూహంగా కనిపిస్తోంది.   

Tags:    

Similar News