Indus Waters Treaty: సింధూజలాలపై పాక్‌ హెచ్చరిక... భారత్‌కు షెహబాజ్ షరీఫ్ వార్నింగ్

భారత్‌ను రెచ్చగొడుతూ పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆ దేశ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూజాలాలను వదలకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

Update: 2026-08-14 04:45 GMT

Indus Waters Treaty: భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందం తీవ్ర వివాదాస్పదంగా మారిన వేళ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌ను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ దేశపు నీటి హక్కులకు ఎలాంటి భంగం కలిగించినా చూస్తూ ఊరుకోబోమని, తమకు ప్రతి నీటి చుక్కా ఒక 'రెడ్ లైన్' అని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, అయితే తమ సార్వభౌమత్వానికి సవాలు ఎదురైతే తగిన రీతిలో సమాధానం ఇస్తామని పేర్కొన్నారు.

పహల్గామ్ దాడి ... సింధూ ఒప్పందంపై ప్రభావం

2025 ఏప్రిల్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ప్రతిస్పందనగా, భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ ప్రకటన పాకిస్తాన్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సింధూ నది దాని ఉపనదులపై ఆధారపడిన తమ వ్యవసాయ రంగానికి భారత్ చర్యలు పెను ముప్పుగా మారతాయని పాక్ భావిస్తోంది. ఇక 2025 మే లో జరిగిన సైనిక ఘర్షణలలో తమ దేశమే విజయం సాధించిందని షెహబాజ్ షరీఫ్ క్లెయిమ్ చేసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఏదైనా ఘర్షణ తలెత్తితే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

సీజ్‌ఫైర్ ... ట్రంప్ జోక్యంపై వివాదం

ఉద్రిక్తతల నడుమ 2025 మే 10 న ఇరుదేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వెనుక యుఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని షరీఫ్ కొనియాడారు. దౌత్యపరమైన సంప్రదింపులు జరిపి ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడినందుకు అమెరికా నాయకత్వానికి పాకిస్తాన్ ధన్యవాదాలు తెలిపింది. అయితే, ఈ సీజ్‌ఫైర్ కేవలం భారత్, పాకిస్తాన్‌ల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే సాధ్యమైందని, ఇందులో ఎలాంటి మూడో పక్షం మధ్యవర్తిత్వం లేదని న్యూఢిల్లీ స్పష్టం చేస్తూ వస్తోంది. పాక్‌ ప్రధాని కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఖాతాలో వేయడంపై భారత్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

కాశ్మీర్ ... అంతర్జాతీయ పరిణామాలు

సింధూ నీటి వివాదాన్ని కాశ్మీర్ అంశంతో ముడిపెడుతూ షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. అణు ఆయుధాలు కలిగిన ఇరుదేశాల మధ్య నిరంతరం ఉద్రిక్తతలు పెరగడానికి ఈ సమస్యలే మూలకారణమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ ఒప్పందం నిలిచిపోవడం వల్ల దక్షిణాసియాలో వ్యూహాత్మక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

Tags:    

Similar News