Petrol Pump Strike: డెడ్ లైన్ 72 గంటలే.. దేశవ్యాప్తంగా మూతపడనున్న బంకులు

Petrol Pump Strike: పాకిస్థాన్‌లో అమలులో ఉన్న రోజువారీ ఇంధన ధరల విధానం వల్ల పెట్రోల్ బంక్ యాజమానులు కోలుకోలేని దెబ్బ తింటున్నారు.

Update: 2026-08-13 01:20 GMT

Petrol Pump Strike

Petrol Pump Strike: పాకిస్థాన్‌లో ఆగస్టు 15 నుంచి పెట్రోల్ బంకులు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. తమ కమీషన్‌ను 8 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ పెట్రోలియం డీలర్లు ప్రభుత్వానికి 72 గంటల తీవ్రమైన అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే దేశవ్యాప్తంగా సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేయడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (PPDA) ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆగస్టు 15 ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఇంధన విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. డీలర్ల సమ్మేళనం తర్వాత పిపిడిఎ ఛైర్మన్ మాలిక్ ఖుదా బక్ష్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 14 వేల మందికి పైగా డీలర్లు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్నారని, తమ కమీషన్ పెంచకపోతే వ్యాపారం నిర్వహించడం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 8 శాతం మార్జిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

హామీ ఇచ్చి ఏమార్చిన ప్రభుత్వం

ఈ వివాదం ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. ఆగస్టు 7న పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్‌ను కలసి సమస్యలను విన్నవించినట్లు అసోసియేషన్ తెలిపింది. అప్పట్లోనే సమ్మె పిలుపునిచ్చినప్పటికీ, రెండు వారాల్లో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఇచ్చిన హామీతో వెనక్కి తగ్గారు. గడువు ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాకపోవడంతో డీలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పిన సర్కారుకు గుణపాఠం చెప్పేందుకే ఈసారి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైనట్లు అసోసియేషన్ నాయకులు తేల్చిచెప్పారు.

రోజువారీ ధరల మారుతున్న తీరుతో భారీ నష్టాలు

ప్రస్తుతం పాకిస్థాన్‌లో అమలులో ఉన్న రోజువారీ ఇంధన ధరల విధానం వల్ల వ్యాపారులు కోలుకోలేని దెబ్బ తింటున్నారు. ప్రతిరోజూ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్రోల్ ధరలు మారుతుండటంతో పాత నిల్వలపై డీలర్లు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. కనీస పెట్టుబడి కూడా చేతికి రాక వ్యాపారులు కూరుకుపోతున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు నిర్వహణ భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివక్షపూరిత కేటాయింపుల విధానం తమ ఉపాధిని దెబ్బతీస్తోందని డీలర్లు మండిపడుతున్నారు.

అంధకారంలోకి ప్రజా రవాణా

ఆగస్టు 15 నుంచి పెట్రోల్ బంకులు మూతపడితే పాకిస్థాన్‌లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పౌరులకు రవాణా వ్యవస్థ నిలిచిపోతే నిత్యావసరాల ధరలు కొండకెక్కే అవకాశం ఉంది. రాబోయే 72 గంటల్లో ప్రభుత్వం డీలర్లతో చర్చలు జరిపి కాంప్రమైజ్ కాకపోతే పరిస్థితి మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంధన డీలర్ల సమ్మె హెచ్చరికతో పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో పడింది. గడువు ముగిసేలోగా సమస్యను పరిష్కరించకపోతే దేశంలో పెట్రోల్ కొరత తీవ్రమై రవాణా వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ముంచుకొస్తోంది.

Tags:    

Similar News