North Korea: ఉత్తర కొరియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 78 ఏళ్లుగా కొనసాగుతున్న జాతీయ జెండా నిష్పత్తిని మార్చింది. 1948లో దేశం ఏర్పడినప్పటి నుంచి అమల్లో ఉన్న కొలతలను సవరించింది. అయితే జెండాలోని రంగులు, ఎర్ర నక్షత్రం మాత్రం అలాగే ఉంచింది. కొత్త రాజ్యాంగంలోని 166వ అధికరణంలో ఈ మార్పును చేర్చింది. ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

జెండాలో ఏం మారింది?

ఉత్తర కొరియా కొత్త రాజ్యాంగం ప్రకారం.. జాతీయ జెండా ఎత్తు, వెడల్పు నిష్పత్తిని 1:2 నుంచి 1:1.65కు మార్చారు. అంటే గతంలో ఉన్న దానితో పోలిస్తే జెండా వెడల్పు తగ్గుతుంది. ఈ మార్పుతో దాని రూపం కొంత పొట్టిగా కనిపిస్తుంది. నవంబర్ 13న ఉత్తర కొరియా ప్రభుత్వానికి చెందిన ప్రచార వెబ్‌సైట్ నైనారా (Naenara)లో సవరించిన రాజ్యాంగం పూర్తి పాఠ్యాన్ని ప్రచురించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1948 తర్వాత జెండా నిష్పత్తిలో మార్పు చేయడం ఇదే తొలిసారి అని యోన్హాప్ వార్తా సంస్థ వెల్లడించింది.

రంగులు, నక్షత్రం మాత్రం అలాగే..

ఉత్తర కొరియా జాతీయ జెండాలో మధ్యలో వెడల్పైన ఎరుపు రంగు పట్టీ ఉంటుంది. దాని పైన, కింద సన్నని తెలుపు పట్టీలు, వాటి తర్వాత నీలం రంగు పట్టీలు ఉంటాయి. ఎరుపు పట్టీకి ఒకవైపు తెల్లటి వృత్తంలో ఐదు కోణాల ఎర్ర నక్షత్రం కనిపిస్తుంది. తాజా మార్పుతో ఈ రూపకల్పనలో ఎలాంటి మార్పు చేయలేదు. ఎరుపు రంగు జపాన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుల త్యాగానికి గుర్తు అని ఉత్తర కొరియా చెబుతోంది. తెలుపు రంగు పట్టీలు, వృత్తం పార్టీ, నాయకత్వంపై ప్రజల విధేయతను సూచిస్తాయని వివరిస్తోంది. నీలం రంగు పట్టీలు శాంతి, స్నేహం, స్వాతంత్ర్యం, దేశ సార్వభౌమత్వానికి ప్రతీకలని పేర్కొంటోంది.

1948లో తొలిసారి జెండా ఆవిష్కరణ

ఉత్తర కొరియా 1948 సెప్టెంబర్‌లో ప్రస్తుత జాతీయ జెండాను అధికారికంగా స్వీకరించింది. అదే ఏడాది సెప్టెంబర్ 9న దేశం ఏర్పడింది. అప్పటి నుంచి జెండా రంగులు, ప్రధాన గుర్తులు మారకుండా కొనసాగుతున్నాయి. గతంలో రాజ్యాంగంలో జెండా ఎత్తు, వెడల్పు నిష్పత్తి 1:2గా ఉండేది. తాజా రాజ్యాంగ సవరణతో దాన్ని 1:1.65గా మార్చారు. అంటే జెండా గుర్తింపును పూర్తిగా మార్చకుండా, దాని కొలతల్లో మాత్రమే మార్పులు చేశారు.

దక్షిణ కొరియాతో దూరం పెంచుకుంటున్న కిమ్

ఈ మార్పును కేవలం జెండా కొలతలకు సంబంధించిన నిర్ణయంగా మాత్రమే చూడలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ జోంగ్ ఉన్ కొంతకాలంగా దక్షిణ కొరియాతో సంబంధాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. రెండు దేశాలూ ఒకే జాతికి చెందినవనే భావనకు బదులుగా.. వాటిని వేర్వేరు దేశాలుగా చూడాలనే విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 2024లో జాతీయ గీతంలోని కొరియా ద్వీపకల్పం మొత్తాన్ని సూచించే పదాలను మార్చడం కూడా ఈ దిశలో తీసుకున్న చర్యగా అప్పట్లో చర్చ జరిగింది.

రాజ్యాంగంలోనూ కీలక మార్పులు

2026లో వెలుగులోకి వచ్చిన రాజ్యాంగ సవరణల్లో దక్షిణ కొరియాతో పునరేకీకరణకు సంబంధించిన పాత ప్రస్తావనలను తొలగించినట్లు యోన్హాప్ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా భూభాగాన్ని చైనా, రష్యా సరిహద్దుల నుంచి దక్షిణ కొరియా వరకు ఉన్న ప్రాంతంగా పేర్కొంటూ కొత్త నిబంధనను చేర్చింది. ఈ నేపథ్యంలో జాతీయ జెండా నిష్పత్తిలో మార్పును కూడా కిమ్ ప్రభుత్వం తన పాలనా కాలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు. అయితే జెండా కొలతల మార్పునకు ప్రభుత్వం వెల్లడించిన ప్రత్యేక కారణం మాత్రం స్పష్టంగా లేదు.

Tags: