మయామి విమానాశ్రయంలో పెను ప్రమాదం.. రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు..
అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయి..
Miami Airport Plane Collision
అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన మరుసటి రోజే, మయామి ఎయిర్పోర్ట్ టార్మాక్‌పై రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పనామా సిటీ నుంచి మయామిలో ల్యాండ్ అయిన 'కోపా ఎయిర్‌లైన్స్' (Copa Airlines) బోయింగ్ 737 విమానం రెక్క చివరి భాగం (వింగ్టిప్), కొలంబియాలోని బొగోటాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న 'యూపీఎస్' (UPS) కార్గో సంస్థకు చెందిన బోయింగ్ 767 విమానం ముందు భాగాన్ని (నోస్) బలంగా తాకింది. రాత్రి 9:15 గంటల సమయంలో విమానాలు ట్యాక్సింగ్ చేస్తుండగా జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఒక్కసారిగా కుదుపు.. కేకలు పెట్టిన ప్రయాణికులు
విమానం సాధారణ వేగంతో రన్‌వేపై వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పక్కకు ఒరిగినట్లయిందని కోపా ఎయిర్‌లైన్స్ ప్రయాణికుడు సీజర్ ఫెర్రీరా తన భయానక అనుభవాన్ని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్యాబిన్‌లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశారని, కొందరు తీవ్ర భయాందోళనకు గురయ్యారని తెలిపారు. అయితే కోపా విమాన సిబ్బంది తక్షణమే స్పందించి ప్రయాణికులందరినీ సీట్లలోనే కూర్చోబెట్టి ధైర్యం చెప్పారు. పది నిమిషాల తర్వాత విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని కెప్టెన్ ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం టగ్ వాహనం సాయంతో విమానాన్ని టెర్మినల్ వద్దకు తరలించి, అందులోని 166 మంది ప్రయాణికులు , ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆదేశాల ఉల్లంఘనే కారణమా?
ఈ ప్రమాదానికి సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రాథమిక వివరాలను వెల్లడించింది. కోపా విమానానికి దారి ఇవ్వాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు యూపీఎస్ విమాన సిబ్బందికి ముందే సూచించినట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో పైలట్లు మాట్లాడుకున్న ఆడియోలో "ఎవరో మమ్మల్ని ఢీకొట్టారు, మా ఎడమ వైపు వింగ్టిప్ విరిగిపోయినట్లుంది" అని కోపా పైలట్ చెప్పగా, "అవును, మేము కొంచెం ముందుకు వెళ్లాము, దాంతో వారి విమానపు రెక్క మమ్మల్ని తాకింది" అని యూపీఎస్ పైలట్ సమాధానమిచ్చాడు. ఈ ఢీకొన్న ధాటికి యూపీఎస్ విమానం ముందు భాగం నుజ్జునుజ్జయి పెద్ద రంధ్రం పడింది. ఈ ఘటనపై ఎఫ్ఏఏ సమగ్ర విచారణకు ఆదేశించగా, అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని కోపా ఎయిర్‌లైన్స్ , యూపీఎస్ సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి.