Israel Next Level War: బెడిసికొట్టిన శాంతి చర్చలు.. నెక్ట్స్ లెవల్ యుద్ధానికి సిద్దమౌతున్న ఇజ్రాయిల్
Israel Next Level War: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి.
Israel Next Level War: బెడిసికొట్టిన శాంతి చర్చలు.. నెక్ట్స్ లెవల్ యుద్ధానికి సిద్దమౌతున్న ఇజ్రాయిల్
Israel Next Level War: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. శాంతి చర్చలు సఫలమై బంధూకాలు, ఫిరంగులు, లోహవిహాంగాల రణగొణ ధ్వనులు శాంతిస్తాయని ఆశించిన ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజా పర్యటన ఒక గట్టి హెచ్చరికను పంపింది. "యుద్ధం ముగియలేదు.. శత్రువు ఇప్పుడు తన మనుగడ కోసం ప్రాణాలతో పోరాడుతున్నాడు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాబోయే భారీ విధ్వంసానికి సంకేతంగా కనిపిస్తున్నాయి.
సరిహద్దులో యుద్ధ గర్జన
ఇటీవల నెతన్యాహూ దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించడం ఈ ఉద్రిక్తతలకు మరింత బలం చేకూర్చింది. ఆయనతో పాటు రక్షణ మంత్రి, ఐడీఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొనడం గమనార్హం. ఈ పర్యటనలో సరిహద్దు భద్రత, భవిష్యత్ దాడులపై వ్యూహాలు, రక్షణ చర్యలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. గాలీలీ డివిజన్ కమాండర్ నుంచి యుద్ధ తదుపరి ప్రణాళికల గురించి బ్రీఫింగ్ తీసుకున్న నెతన్యాహు, అక్కడి నుంచే తన యుద్ధ కాంక్షను స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఒకేసారి రెండు దిశల్లో దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకవైపు ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగిస్తూనే, మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌పై కూడా చర్యలు ముమ్మరం చేసింది. హెజ్బొల్లా ఇరాన్‌కు మద్దతు ఉన్న దేశంగా పరిగణించబడుతుంది. గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు, సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్నాయి.
పశ్చిమాసియాలో మారిన సమీకరణాలు
సాధారణంగా ఏ దేశమైనా అమెరికా వంటి అగ్రరాజ్యాలు శాంతి చర్చలు జరుపుతున్నప్పుడు కాస్త వెనక్కి తగ్గుతాయి. కానీ, ఇజ్రాయెల్ రూటే వేరు. ఇటు ఇరాన్‌తో చర్చలకు సన్నాహాలు జరుగుతుండగానే.. అటు ఇరాన్ దత్తపుత్రుడైన 'హెజ్బొల్లా'ను దెబ్బకొట్టేందుకు లెబనాన్ వైపు నెతన్యాహు అడుగులు వేశారు. దీనివల్ల ఇరాన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
ప్రస్తుతం యాంటీ-ట్యాంక్ దాడులు, హై-ట్రాజెక్టరీ రాకెట్లను ఎదుర్కొంటున్నామని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి రాలేదని తెలుస్తోంది. “మేము చాలా సాధించాం… కానీ ఇంకా పని మిగిలే ఉందని” నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు యుద్ధం మరింత విస్తరించే సూచనలను ఇస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి సాధన కంటే యుద్ధం వైపు పరిస్థితులు మళ్లుతున్నాయని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు కొత్తవి కావు. గతంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌ను పూర్తిగా నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. ఇదే కారణంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌ను పెద్ద ముప్పుగా చూస్తోంది. ఇరాన్ ప్రభావం పెరిగితే, మిడిల్ ఈస్ట్‌లో శక్తి సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని ఇజ్రాయెల్ భావిస్తోంది.
ప్రపంచ మార్కెట్లపై ప్రభావం
ఈ ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కావు. యుద్ధం తీవ్రత పెరిగితే అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నెతన్యాహు ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉండటంతో, యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తంగా చూసుకుంటే శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయిల్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్ ప్రతిస్పందన, అమెరికా పాత్ర కలిపి రాబోయే రోజుల్లో పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వెళ్లి శాంతి వైపు చూడాలా లేక మరో యుద్ధానికి సిద్దమవ్వాలా అన్న సందిగ్దంలో ఉన్నది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.