Ladakh Viral Video : సరిహద్దుల్లోనే కాదు.. ఆపదలోనూ హీరోలే.. లడఖ్‌లో ఆర్మీ చేసిన పని వైరల్.!
Ladakh Viral Video : లడఖ్‌లోని ‘పాంగాంగ్ నుండి హన్లే’ వెళ్లే దారిలో ఒక బైక్ ప్రమాదం జరిగింది. అక్కడ దెబ్బలు తగిలిన భార్యాభర్తలను కాపాడటానికి మన భారత ఆర్మీ
Indian Army
Ladakh Viral Video : లడఖ్‌లోని ‘పాంగాంగ్ నుండి హన్లే’ వెళ్లే దారిలో ఒక బైక్ ప్రమాదం జరిగింది. అక్కడ దెబ్బలు తగిలిన భార్యాభర్తలను కాపాడటానికి మన భారత ఆర్మీ జవాన్లు వెంటనే స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడటమే కాదు, ఆపదలో ఉన్న జనాన్ని ఆదుకోవడంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని ఆర్మీ జవాన్లు మరోసారి నిరూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు జవాన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సైన్యం లారీని ఆపిన తోటి బైకర్స్
సాదియా ఖాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. లడఖ్‌లోని ఒక మారుమూల దారిలో వెళ్తుండగా ఒక దంపతుల బైక్ ప్రమాదానికి గురైంది. అదే దారిలో వెళ్తున్న సాదియా ఖాన్, ఆమెతో పాటు ఉన్న మిగతా బైక్ రైడర్స్ అది చూశారు. వెంటనే ఆ దారిలో వస్తున్న ఒక ఇండియన్ ఆర్మీ ట్రక్కును ఆపి, దెబ్బలు తగిలిన వారికి సహాయం చేయాలని జవాన్లను కోరారు.
విషయం తెలియగానే ఆర్మీ జవాన్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రక్కు దిగి వచ్చారు. దెబ్బతిన్న బైక్‌ను ఎత్తి జాగ్రత్తగా ఆర్మీ ట్రక్కులోకి ఎక్కించారు. ఆ సమయంలో అక్కడున్న బైకర్లందరూ ఎంతో ఆనందంతో “భారత్ మాతా కీ జై” అంటూ నినాదాలు చేశారు. ఈ సీన్ వీడియోలో చూస్తుంటే ఎవరికైనా సరే ముచ్చటేస్తుంది.
థార్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం
ఆ తర్వాత బాధితుల పరిస్థితి ఎలా ఉందో కూడా సాదియా ఖాన్ సోషల్ మీడియాలో చెప్పారు. ప్రమాదానికి గురైన దంపతులు ఇద్దరూ ఇప్పుడు క్షేమంగా ఉన్నారని, జవాన్లు వారిని సురక్షితమైన చోటుకి చేర్చారని తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూడా ఆమె వివరించారు. "ఒక థార్ కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మొదట ఆ డ్రైవర్ బైక్‌కు ఓవర్‌టేక్ చేయడానికి సైడ్ ఇచ్చాడు, కానీ ఆ వెంటనే సడన్‌గా అడ్డం వచ్చాడు. దాంతో బైక్ కంట్రోల్ తప్పి కిందపడిపోయింది. మేము అక్కడికి వెళ్లేసరికే వాళ్లు కిందపడిపోయారు, ఆ థార్ డ్రైవర్ మాత్రం అక్కడి నుండి పారిపోయాడు" అని సాదియా చెప్పారు. ఈ సందర్భంగా బైక్ రైడర్స్ అందరూ రోడ్డుపై ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకోవాలని ఆమె కోరారు.
జవాన్లపై నెటిజన్ల ప్రశంసలు
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. లడఖ్ లాంటి కష్టమైన ప్రాంతంలో జవాన్లు అంత వేగంగా స్పందించిన తీరుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. గతంలో హన్లే ప్రాంతంలో తమకు కూడా ఇలాంటి సమస్యే వచ్చిందని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆర్మీ జవాన్లే ‘దేవుడిలా’ వచ్చి కాపాడారని ఒక యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. లడఖ్‌లో ఆర్మీ వాళ్లను చూస్తే గౌరవం మరింత పెరుగుతుందని, వాళ్లు సరిహద్దుల్లో అంత కష్టపడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మారుమూల కొండ ప్రాంతాల్లో మన ఆర్మీ ఎంత అలర్ట్‌గా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.