Afghanistan: వాణిజ్య సామ్రాజ్యం నుంచి యుద్ధభూమిగా... ఆఫ్ఘనిస్తాన్ పతనం వెనుక చేదు నిజాలు
ఒకప్పుడు ప్రపంచ వాణిజ్య రాజధానిగా వెలుగొందిన ఆఫ్ఘనిస్తాన్ నేడు కరువు కాటకాలతో, దారిద్య్రం, అంతర్గత యుద్ధాలతో సతమతమవడానికి కారణాలు ఇవే.
Afghanistan: ఒకప్పుడు ఏ దేశానికైనా సిరిసంపదలు పెరగాలన్నా, ప్రపంచ దేశాలతో వ్యాపారం సాగాలన్నా 'సిల్క్ రూట్' అత్యంత కీలకంగా ఉండేది. ఆ పట్టు వస్త్రాల రహదారికి, ఆసియా ఖండపు వాణిజ్య కేంద్ర బిందువే ఒకనాటి ఆఫ్ఘనిస్తాన్. పూర్వ కాలంలో వ్యాపారం అంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు కాబూల్. ప్రపంచ దేశాల మధ్య అరుదైన వజ్రాలు, మేలిమి జాతి అరబ్బు గుర్రాలు, మేలైన డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కాబూల్ నగరం ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. ఒకప్పుడు ప్రపంచ వ్యాపారాన్ని శాసించిన ఆ భూమి, నేడు నిత్యం బాంబు పేలుళ్లు, రక్తపాతం, ఆకలి కేకలతో నకనకలాడుతోంది. ప్రజాస్వామ్యం కూలిపోయి, తుపాకీ పట్టిన తాలిబన్ల చేతుల్లోకి పాలన వెళ్ళిపోయింది. అసలు అంతటి వైభవోపేతమైన వాణిజ్య సామ్రాజ్యం, నేడు ఎందుకు స్మశాన వాటికలా మారింది? దీని వెనుక ఉన్న చేదు నిజాలను, చారిత్రక శక్తుల కుట్రలను ఇప్పుడు విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.
భౌగోళిక స్థానమే శాపంగా మారిన వైనం
ఆఫ్ఘనిస్తాన్ పతనానికి ప్రధాన కారణం దాని భౌగోళిక స్థానమే. ఇది మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా దేశాల సరిహద్దులను కలుపుతుంది. ఈ వ్యూహాత్మక స్థానం వల్లనే దీనిని "గ్రేట్ గేమ్" కు కేంద్రంగా మార్చారు. ప్రపంచాన్ని శాసించాలనుకున్న సామ్రాజ్యాలన్నీ ఆఫ్ఘనిస్తాన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూశాయి. 19వ శతాబ్దంలో బ్రిటీష్ సామ్రాజ్యం రష్యాను అడ్డుకోవడానికి ఈ ప్రాంతంలోనే యుద్ధాలు చేసింది. ఆ తరువాత 1979 నుంచి 1989 మధ్యలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్‌ను నియంత్రిస్తూ వచ్చింది. ఆ దేశంలో సుమారు 1.15 లక్షల మంది రష్యన్ సైనికులు ఈ దేశంలో ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ఇక 2001 నుంచి 2021 వరకు దాదాపు 20 సంవత్సరాలపాటు అమెరికా తన అధునాతన సైన్యంతో ఇక్కడ తిష్టవేసింది. ఈ వివేశీ శక్తుల స్వార్థపూరిత రాజకీయాల వల్లే ఆఫ్ఘనిస్తాన్ తన సొంత అస్తిత్వాన్ని కోల్పోయి కేవలం ఒక యుద్ధభూమిగా మిగిలిపోయింది.
అంతర్గత కలహాలు... తీవ్రవాదం పుట్టుక
బయటి శక్తులు దేశాన్ని వదిలి వెళ్ళిన ప్రతిసారీ అక్కడ ఒక శూన్యత ఏర్పడింది. రష్యాను ఓడించడానికి అమెరికా వంటి దేశాలు స్థానిక ముజాహిద్దీన్ గ్రూపులకు విచ్చలవిడిగా ఆయుధాలు, నిధులు సమకూర్చాయి. ఆ ఆయుధాలే కాలక్రమేణా భస్మాసుర హస్తాలుగా మారి 'తాలిబన్' అనే ఉగ్రవాద రూపం దాల్చాయి. 1996 నుంచి 2001 వరకు రష్యాకు వ్యతిరేకంగా అమెరికా బలపరిచిన తాలిబన్లు పాలనలోకి వచ్చారు. ఆ సమయంలో దేశంలో భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మహిళా విద్యపై నిషేధం విధించారు. అయితే, 2001 నుంచి 2021 వరకు అమెరికా మద్దతుతో పాలన నడిచింది. అయితే ప్రజా ప్రభుత్వం అవినీతి పెరిగిపోవడం, అంతర్గత గిరిజన గ్రూపుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2021 ఆగస్టులో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో అంతర్జాతీయంగా పలు ఆంక్షలు ఎదుర్కొంటున్నది. తీవ్రమైన సంక్షోభంతో పాటు, దారిద్య్రం పెరిగిపోయింది. అంతర్గత కలహాలు తగ్గినా..పాకిస్తాన్ నుంచి నిరంతరం దాడుల జరుగుతుండటంతో సంక్షోభంలో కూరుకుపోయింది.
పొరుగు దేశాల కుట్రలు ... పాకిస్తాన్ ద్వంద్వ నీతి
ఆఫ్ఘనిస్తాన్ పతనంలో పొరుగున ఉన్న పాకిస్తాన్ పాత్ర చాలా ఎక్కువ. పైకి శాంతి మంత్రాలు జపిస్తూనే, లోపల తాలిబన్లకు సురక్షిత స్థావరాలు కల్పించి, వారిని వ్యూహాత్మక ఆయుధంగా వాడుకుంది. కానీ నేడు అదే పాకిస్తాన్‌కు, తాలిబన్ ప్రభుత్వానికి మధ్య సరిహద్దు వివాదాలు తారాస్థాయికి చేరి, నిత్యం సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నాయి. పెంచిన పామే ఇప్పుడు యజమానిని కరవడానికి వస్తున్న చందంగా పాక్ పరిస్థితి తయారైంది. అమెరికా వదిలేసి వెళ్లిన తుప్పుపట్టిన ఆయుధాలను ఉపయోగిస్తూ వచ్చిన తాలిబన్‌లు ఇప్పుడు ఆయుధాలను సమకూర్చుకునేందుకు రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు రష్యాతో భాగస్వామ్యం అవుతున్నారు. రష్యాతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవడం దీనికో నిదర్శనం.
"ఒక దేశ ఆర్థిక మూలాలు దెబ్బతిని, కేవలం ఆయుధ సంస్కృతి పెరిగినప్పుడు అక్కడ శాంతి కరువవుతుంది." ఒకప్పుడు ప్రపంచాన్ని తన వ్యాపారంతో ఆకర్షించిన కాబూల్, నేడు స్వార్థ రాజకీయాల వల్ల విలవిలలాడుతోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు 90% పైగా ప్రజలు సరైన ఆహారం, ఉపాధి లేక దారిద్య్ర రేఖకు దిగువన మగ్గుతున్నారు. ప్రపంచ దేశాలు ఈ భూమిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానేసి, మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడే.. ఒకనాటి సువర్ణ భూమి అయిన ఆఫ్ఘనిస్తాన్‌కు మళ్లీ పూర్వ వైభవం సాధ్యమవుతుంది.