Uppal: ఉప్పల్ సమ్మర్ క్యాంప్ ముగింపు
Uppal: ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేసిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.
Uppal: ఉప్పల్ సమ్మర్ క్యాంప్ ముగింపు
ఉప్పల్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ జోన్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్-2026 ఆదివారం ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో ఘనంగా ముగిసింది. ఉప్పల్ జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 78 కేంద్రాల్లో 12 క్రీడా విభాగాలకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా, వందలాది మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
యువ క్రీడాకారులు నిర్వహించిన మార్చ్‌పాస్ట్‌ను పరిశీలించిన ఆయన, విద్యార్థులను అభినందిస్తూ వారి క్రమశిక్షణ, ప్రతిభను కొనియాడారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, పతకాలు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాల పెంపొందింపుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
గతంలో ప్రతి పాఠశాలలో విశాలమైన క్రీడా మైదానాలు, ప్రత్యేక పీఈటీ ఉపాధ్యాయులు ఉండేవారని, ప్రస్తుతం చాలా పాఠశాలలు పరిమిత స్థలంలోనే కొనసాగుతున్న కారణంగా విద్యార్థులకు క్రీడలకు తగిన అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువగా భవనాలకే పరిమితమైపోతున్నారని, క్రీడల కోసం తగిన స్థలం కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న క్రీడా శిక్షణా శిబిరాలు, సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే క్రీడాకారులను తయారు చేస్తాయని పేర్కొన్నారు. ఉప్పల్ ప్రాంతం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు. క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయగా, విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, పతకాలు ప్రదానం చేశారు. క్యాంప్ విజయవంతానికి కృషి చేసిన కోచ్‌లు, శిక్షకులను ప్రత్యేకంగా సన్మానించి వారి సేవలను గుర్తించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, సూపరింటెండింగ్ ఇంజినీర్ హరి కిశోర్, డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ, డీఈఈ వేణల్ గౌడ్, ఇన్‌చార్జ్ గేమ్స్ ఇన్‌స్పెక్టర్ బి.ఎం. విఘ్నేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందించడంతో పాటు భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దే వేదికగా నిలిచిందని అధికారులు తెలిపారు.