LB Nagar: పెండింగ్ పనులపై కమిషనర్ తో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ!

LB Nagar: మన్సూరాబాద్ జడ్పీ రోడ్డు ఆక్రమణల తొలగింపు మరియు నియోజకవర్గ పెండింగ్ పనుల త్వరితగతిన పూర్తిపై చర్చించారు.

Update: 2026-07-25 14:10 GMT

LB Nagar: పెండింగ్ పనులపై కమిషనర్ తో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ!

ఎల్‌బీనగర్: ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎంసీహెచ్‌సీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ చౌరస్తా వద్ద రోడ్డు వెడల్పు పనులపై గతంలో స్పందించి పరిశీలించినందుకు కమిషనర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

చంపాపేట్ డివిజన్‌లో సుల్తాన్‌వాల్వ మినీ ఫంక్షన్ హాల్ పునరుద్ధరణ, కమ్యూనిటీ హాల్, షెడ్, మరుగుదొడ్లు, బోర్‌వెల్ వంటి మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని కోరారు. హయత్‌నగర్ డివిజన్‌లో మహా గాయత్రీ నగర్ సీసీ రోడ్డు, ఓపెన్ జిమ్ పనులతో పాటు సాయి గార్డెన్ కాలనీలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

మన్సూరాబాద్ డివిజన్‌లో పాత పోచంపల్లి రోడ్డును ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకుని పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కోరారు. దాదాపు 50 కాలనీలకు అనుసంధానంగా ఉన్న ఈ చారిత్రక జడ్పీ రోడ్డు ఓఆర్‌ఆర్‌కు కీలక మార్గమని, దీనిని ప్రాధాన్యతతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

బీఎన్‌రెడ్డి డివిజన్‌లో హరిహరపురం, విజయపురి ఫేజ్-1 కమ్యూనిటీ హాళ్లకు అదనపు అంతస్తుల నిర్మాణం, విజయ్‌నగర్, ఎస్‌కేడీ నగర్‌లలో సీసీ రోడ్ల నిర్మాణం, వివేకానంద పార్క్, మెడికల్ అండ్ హెల్త్ కాలనీల్లో ఓపెన్ జిమ్‌లు, చిన్నారుల ఆట పరికరాల ఏర్పాటు, మారుతీ నగర్ పార్కుకు కాంపౌండ్ వాల్, పార్కు అభివృద్ధి, కప్రాయి చెరువు వరదనీటి కాలువ మిగిలిన పనులు, శివసాయి కాలనీలో ఓపెన్ డ్రైన్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.

ఈ పనులన్నీ ప్రస్తుతం జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, రెండు మూడు రోజుల్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించి, వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, భాస్కర్ సాగర్, రవి ముదిరాజ్, గండికోట శ్రీనాథ్‌తో పాటు పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News