Saroornagar: బీసీ బిల్లు కోసం పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన కవిత!
Saroornagar: హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రక్షణ సేన (TRS) ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’ ఘనంగా జరిగింది.
Saroornagar: బీసీ బిల్లు కోసం పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన కవిత!
సరూర్‌నగర్: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో తెలంగాణ రక్షణ సేన (TRS) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సామాజిక న్యాయం, బీసీ హక్కులు, రాజ్యాంగ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆత్మ, మనసు ఒప్పుకోని పని ఎంత పెద్ద లాభం వచ్చినా ఎప్పటికీ చేయనని, విలువలను వదులుకుని ఉంటే నేడు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో తెలంగాణలో మంచి మార్పు తీసుకురాగలమనే విశ్వాసంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు.
సామాజిక న్యాయం అంటే అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే అసలైన సామాజిక న్యాయమని పేర్కొన్నారు. "100 రొట్టెలు ఉంటే ఆకలితో ఉన్న 100 మందికి ఒక్కొక్క రొట్టె అందించడమే సామాజిక న్యాయం" అని ఉదాహరణతో వివరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడిచినా దేశంలో ఇంకా సంపూర్ణంగా అమలు కాలేదని, రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా అమలు చేయడానికే సామాజిక న్యాయ పోరాట జైత్రయాత్రను ప్రారంభిస్తున్నామని చెప్పారు.
సామాజిక న్యాయం అనగానే అపోహలు, భయాలు వీడాలని, అగ్రవర్ణాల యువత, మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల అమలులో మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, తమిళనాడులో రిజర్వేషన్ల రక్షణలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత చేసిన కృషిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
దేశంలో ఇంకా లక్షలాది ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవం, జీవన ప్రమాణాలు పెంచే విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థానాలకు చేరేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని, దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన ఉద్యమం కొనసాగిస్తుందని ప్రకటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి, ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించేలా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు.
రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా దారి మళ్లకుండా వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలన్నింటినీ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సావిత్రిబాయి పూలే జయంతి వరకు ఐదు నెలల పాటు ప్రతి గ్రామం, మండలం, జిల్లాలో సామాజిక న్యాయ సంకల్ప సభలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామని, అనంతరం వేలాదిమందితో ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు హెచ్చరిక జారీ చేశారు.
సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ తీర్మానాలు..
- బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలి.
- చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.
- మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలి.
- ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి, ఆయనకు పద్మభూషణ్ ప్రకటించాలి.
- ఎస్సీలకు కేటాయించిన నిధులను పూర్తిగా వారి అభివృద్ధికే వినియోగించాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులన్నింటినీ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి.
- ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించాలి.
- సావిత్రిబాయి పూలే జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయ సంకల్ప సభలు నిర్వహించాలి.
- బడ్జెట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించాలంటూ అవసరమైతే ఢిల్లీలో భారీ ఉద్యమం చేపట్టాలి.