Uppal: స్టైపెండ్ పెంపుకై రామంతాపూర్‌లో ఆయుష్ వైద్యుల వంటావార్పు!
Uppal: అల్లోపతి వైద్యులతో సమానంగా స్టైపెండ్ పెంచాలని రామంతాపూర్‌లో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు 7వ రోజు వంటావార్పు నిరసన చేపట్టారు.
Uppal: స్టైపెండ్ పెంపుకై రామంతాపూర్‌లో ఆయుష్ వైద్యుల వంటావార్పు!
Uppal: స్టైపెండ్ పెంపు డిమాండ్‌తో ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో సోమవారం రామంతాపూర్‌లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు.
తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్–పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ స్టైపెండ్‌ను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
అల్లోపతికి ఒక న్యాయం.. ఆయుష్‌కు మరో న్యాయమా?
అల్లోపతి వైద్యులు, విద్యార్థుల స్టైపెండ్‌ను ప్రభుత్వం పెంచినప్పటికీ ఆయుష్ విద్యార్థుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతోందని జేఏసీ ప్రతినిధులు ప్రశ్నించారు. వైద్య సేవలు అందించడంలో అల్లోపతి, ఆయుష్ విభాగాలకు చెందిన హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు సమానంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
రాత్రింబగళ్లు ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూ రోగులకు సేవలందిస్తున్న తమకు స్టైపెండ్ విషయంలో మాత్రం తీవ్ర వ్యత్యాసం ఉండటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో హామీ.. ఇప్పుడు స్పందన ఏది?
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆయుష్ వైద్యులు, విద్యార్థుల స్టైపెండ్ పెంపు అంశాన్ని ప్రస్తావించారని జేఏసీ ప్రతినిధులు గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 33 నెలలు కావస్తున్నా అప్పట్లో ప్రస్తావించిన సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదని విమర్శించారు.
తమ సమ్మెతోనైనా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశించామని, అయితే ఆందోళన ఏడో రోజుకు చేరినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని స్టైపెండ్ పెంపునకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న ఖర్చులు సరిపోని స్టైపెండ్, జీవన వ్యయం, వసతి, ఆహారం, ప్రయాణం, విద్యా ఖర్చులు గణనీయంగా పెరిగినా ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్‌లో తగిన పెంపు లేదని తెలిపారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోకపోవడంతోనే నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు.
స్పందించకపోతే ఆందోళన ఉధృతం, తమ న్యాయమైన డిమాండ్ పై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి, అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైపెండ్ పెంచాలని జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసింది.
డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు.