Bamboo : రైతులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా మొక్కలు, మూడేళ్ల ఖర్చు ప్రభుత్వానిదే
Bamboo : తెలంగాణలో సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
Bamboo : రైతులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా మొక్కలు, మూడేళ్ల ఖర్చు ప్రభుత్వానిదే
Bamboo cultivation: సాంప్రదాయ పంటలు వేసి అప్పులపాలువుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే ప్రత్యామ్నాయ లాభసాటి మార్గాన్ని చూపిస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు నిరంతర, స్థిరమైన ఆదాయాన్ని అందించడమే లక్ష్యంగా వెదురు సాగుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేయించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చాలని అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే 5 జిల్లాల్లో విజయవంతమైన ఈ సరికొత్త ప్రాజెక్టును, తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరో 3 జిల్లాలకు విస్తరిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో హార్టికల్చర్, ఫారెస్ట్ శాఖలు కలిసి ఈ బృహత్తర ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాయి.
వెదురు సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం కొండంత అండగా నిలవనుంది. లబ్ధిదారులైన ప్రతి రైతుకు ఉచితంగా 60 వెదురు మొక్కలను పంపిణీ చేస్తారు. మొక్కలు నాటినప్పటి నుంచి అవి చేతికి వచ్చే వరకు నిరుపేద రైతులకు భారం కాకుండా.. ‘గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కింద మూడేళ్ల పాటు ఉచితంగా రక్షణ, నీటి వసతి కల్పన వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఒకవేళ ఏదైనా మొక్క చనిపోతే, ఆ స్థానంలో మరో మొక్కను ప్రభుత్వమే ఉచితంగా నాటుతుంది. మొక్కకు మొక్కకు మధ్య 15అడుగుల దూరం ఉండేలా నాటనున్నారు. సాగుకు ముందే భూమికి అవసరమైన కెమికల్ ట్రీట్‌మెంట్ కూడా ఉచితంగా చేస్తారు. దీంతో రైతులకు శ్రమ, పెట్టుబడి రెండూ తప్పుతాయి.
ఐదేళ్లలో కోత..
వెదురు నాటిన ఐదేళ్లలో మొదటి కోతకు వస్తుంది. విశేషం ఏంటంటే.. ఒకసారి కోత ప్రారంభమైతే, దాదాపు 30 నుంచి 40 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఈ పంట ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చు. రైతు పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలనే ఆందోళన లేకుండా ప్రభుత్వమే ముందస్తు మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తోంది. కాగితపు పరిశ్రమలు, చేతివృత్తుల కేంద్రాలు, వాణిజ్య సంస్థలతో సెర్ప్ అధికారులు ముందే ఒప్పందాలు కుదుర్చుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో వెదురు కర్రకు రూ. 130 నుంచి రూ. 180 వరకు ధర లభిస్తుండటంతో రైతులకు భారీ లాభాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.