Colon Cancer: తరచూ కడుపు నొప్పి, ఎక్కిళ్లు వస్తున్నాయా.? పెద్దపేగు క్యాన్సర్ కావొచ్చు
Colon Cancer: ప్రస్తుతం యువతలో కూడా పెద్దపేగు క్యాన్సర్ (Colon Cancer) కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Colon Cancer: తరచూ కడుపు నొప్పి, ఎక్కిళ్లు వస్తున్నాయా.? పెద్దపేగు క్యాన్సర్ కావొచ్చు
Colon Cancer: ప్రస్తుతం యువతలో కూడా పెద్దపేగు క్యాన్సర్ (Colon Cancer) కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటి దశలో ఈ వ్యాధి లక్షణాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. అందుకే చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా ఈ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించొచ్చు.
కారణం లేకుండా అలసట, ఐరన్ లోపం
కోలన్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి ఐరన్ లోపం (అనీమియా). ఎటువంటి కారణం లేకుండా తరచుగా అలసటగా అనిపించడం, చర్మం పసుపు రంగులోకి మారడం, చిన్న పని చేసినా అలసిపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో శరీరంలో లోపలే రక్తస్రావం జరుగుతుంది. ఈ రక్తస్రావం ట్యూమర్ కారణంగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
మల విసర్జనలో మార్పులు
మల విసర్జనలో వచ్చే మార్పులు కూడా పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఉదాహరణకు తరచూ మలబద్ధకం ఏర్పడడం, డయేరియా (విరేచనాలు) కావడం, మలం చాలా పలుచగా మారడం. మలం సన్నగా రావడం వంటివి పెద్ద పేగుల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడిందనడానికి సంకేతంగా భావించాలి. కొన్ని సందర్భాల్లో ఈ అడ్డంకి ట్యూమర్ కారణంగా ఉండొచ్చు.
అకస్మాత్తుగా బరువు తగ్గడం
మీరు డైట్ చేయకపోయినా, వ్యాయామం చేయకపోయినా అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా ఒక హెచ్చరిక కావచ్చు. శరీరంలో ట్యూమర్ ఉన్నప్పుడు పోషకాలు సరిగా శోషించుకోవు. దీంతో శరీరం బలహీనపడుతుంది. బరువు కూడా వేగంగా తగ్గుతుంది. ఈ మార్పు కొన్ని వారాలు లేదా నెలలు కొనసాగితే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.
తరచూ పొట్ట నొప్పి, ఎక్కిళ్లు
కొంతమందికి తరచూ పొట్ట నొప్పి, మలత, కడుపులో మంట లేదా ఎక్కిళ్లు రావచ్చు. అలాగే కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిపోయినట్టు అనిపించడం కూడా ఒక లక్షణంగా ఉండొచ్చు. ఇవి సాధారణ గ్యాస్ సమస్యలుగా అనిపించినా, కొన్ని సందర్భాల్లో పెద్ద పేగులో సమస్య ఉందని సూచించవచ్చు. అందుకే ఈ సమస్యలు ఎక్కువ రోజుల పాటు కొనసాగితే పరీక్షలు చేయించుకోవడం అవసరం.
మలంలో రక్తం కనిపించడం
కోలన్ క్యాన్సర్‌కు ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి మలంలో రక్తం కనిపించడం. మలం రంగు నలుపుగా లేదా గాఢ ఎరుపు రంగులో కనిపిస్తే అది శరీరంలో ఎక్కడో రక్తస్రావం జరుగుతుందనే సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఇది మలద్వార వ్యాధులు (పైల్స్ లేదా అనల్ ఫిషర్) వల్ల కూడా ఉండొచ్చు. అయినా కూడా దీనిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
జాగ్రత్త ఎందుకు అవసరం?
కోలన్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది. కానీ ఆలస్యంగా గుర్తిస్తే ఇది శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకే పై లక్షణాల్లో ఏదైనా చాలా రోజుల పాటు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. వైద్యుల సూచనలకు ఇవి ప్రత్యామ్నాయం కావని గుర్తించాలి.