Mother Kills Son : మద్యం తెచ్చిన ముప్పు.. అనంతపురం జిల్లాలో ఒకేరోజు రెండు ఘోర హత్యలు
Mother Kills Son : అనంతపురంలో మద్యానికి బానిసైన కొడుకు వేధింపులు భరించలేక కన్నతల్లే కత్తెరతో పొడిచి చంపింది.
Mother Kills Son
Mother Kills Son : నవమాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును ఒక కన్నతల్లి తన చేతులతోనే నిర్దాక్షిణ్యంగా కడతేర్చింది. మరో ఘటనలో నిత్యం గొడవపడుతున్నాడనే కోపంతో కన్నతండ్రి ప్రాణాలనే కొడుకు బలితీసుకున్నాడు. ఈ రెండు దారుణాలకు కారణం ఒక్కటే.. అదే మద్యం మహమ్మారి. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని, కుటుంబాలను రోడ్డున పడేస్తుందని ఎంత మొత్తుకుంటున్నా జనాలు మందుపై మక్కువ వీడటం లేదు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి చేసే దారుణాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో సోమవారం రోజున రెండు వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనలు సామాజిక బంధాలు ఎంతలా బలహీనపడుతున్నాయో నిదర్శనంగా నిలుస్తున్నాయి.
వేధింపులు భరించలేక కొడుకును కత్తెరతో పొడిచిన తల్లి
అనంతపురం నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి ఘోరం వెలుగుచూసింది. అనంతపురం టౌన్ మొదటి రోడ్డుకు చెందిన బోనాల సురేంద్ర (28) అనే యువకుడు గత కొంతకాలంగా మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ, ప్రతిరోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవపడటం, తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా వేధించడం అతడికి అలవాటుగా మారింది. సోమవారం సాయంత్రం కూడా సురేంద్ర పూర్తిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మత్తులో కన్నతల్లి సునీతమ్మతో తీవ్రంగా గొడవపడటమే కాకుండా, ఆమెపై దాడికి ప్రయత్నించాడు.
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సునీతమ్మ
కొడుకు రోజురోజుకూ పెడుతున్న చిత్రహింసలతో విసిగిపోయిన సునీతమ్మ, ఆ సమయంలో అతడు దాడికి దిగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. క్షణికావేశంలో తనను తాను నియంత్రించుకోలేక ఇంట్లో ఉన్న కత్తెరను తీసుకుని సురేంద్ర గొంతు భాగంలో బలంగా పొడిచింది. దీంతో తీవ్ర రక్తస్రావమై సురేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు చనిపోయాడని గ్రహించిన సునీతమ్మ, భయపడకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బొమ్మనహాళ్ మండలంలో తండ్రి అనుమానాస్పద మృతి
ఇదే తరహాలో జిల్లాలోని బొమ్మనహాళ్ మండలంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప్పరహాళ్ గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి (52) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమంతరెడ్డి కూడా ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో భార్యాపిల్లలతో గొడవలు పడేవాడు. ఈ తాగుడు గొడవల నేపథ్యంలోనే, సోమవారం కూడా మద్యం మత్తులో గొడవకు దిగడంతో విసిగిపోయిన కుమారుడే తండ్రిని కొట్టి చంపి ఉంటాడనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసులు నమోదు చేసిన పోలీసులు
మృతుడు హనుమంతరెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, కుమారుడే తండ్రిని చంపాడా లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒకేరోజు జిల్లాలో మద్యం కారణంగా తల్లి చేతిలో కొడుకు, కొడుకు చేతిలో తండ్రి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.