Madanapalle: కలెక్టరేట్ ఎదుట చేనేత కార్మికుల ధర్నా సీపీఐ మద్దతు!

Madanapalle: అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న భరోసా నిధులు జమ చేయాలని కోరుతూ మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సీపీఐ మద్దతుతో నేతన్నలు ధర్నా నిర్వహించారు.

Update: 2026-08-10 06:37 GMT

Madanapalle: కలెక్టరేట్ ఎదుట చేనేత కార్మికుల ధర్నా సీపీఐ మద్దతు!

Madanapalle: మదనపల్లె, ఆగస్టు 10: అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం నేతన్న భరోసా పథకం కింద అర్హులైన చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25 వేల ఆర్థిక సాయం విడుదల చేసినప్పటికీ, నిజమైన నేతన్నలకు మాత్రం ఆ సాయం అందలేదని ఆరోపిస్తూ చేనేత కార్మికులు సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

అర్హత ఉన్న చేనేత కార్మికులకు డబ్బులు జమ కాకుండా మార్కెట్‌ యార్డులో పనిచేసే వారికి, ఆటోలు నడుపుతున్న వారికి సైతం నేతన్న భరోసా నిధులు జమ అయ్యాయని నేతన్నలు ఆరోపించారు. చేనేత వృత్తితో సంబంధం లేని అనర్హులకు పథకం వర్తింపజేయడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సచివాలయ సిబ్బంది, సంబంధిత ఏడి అధికారులు కుమ్మక్కై అనర్హులను నేతన్న భరోసా పథకంలో చేర్చి నిధులు మంజూరు చేశారని నేతన్నలు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న అర్హులైన నేతన్నలకు మాత్రం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం దక్కకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సీపీఐ నాయకులు మద్దతుగా నిలిచి నేతన్నల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబాన్ని గుర్తించి, నేతన్న భరోసా పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా నేతన్న మహిళలు మాట్లాడుతూ.. “చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న మాకు నేతన్న భరోసా ఎంతో ఉపయోగకరం. కానీ అర్హులైన నిజమైన నేతన్నలకు డబ్బులు జమ కాకుండా, చేనేత వృత్తితో సంబంధం లేని వారికి సైతం నిధులు అందడం బాధాకరం.

సచివాలయ స్థాయిలో జరిగిన అక్రమాలను అధికారులు విచారించి, నిజమైన నేతన్నలను గుర్తించి వెంటనే రూ.25 వేల సాయం అందించాలి” అని కోరారు. నేతన్న భరోసా పథకం లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన వారికి న్యాయం చేయాలని, అనర్హులకు మంజూరైన నిధులను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News