Madanapalle: మదనపల్లెలో పునీత్ కుమార్ జన్మదిన సేవా కార్యక్రమాలు

మదనపల్లె: బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్ జన్మదిన వేడుకలు మదనపల్లెలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందజేశారు.

మున్సిపల్ కార్మికులు, పేదలు, నిస్సహాయుల కోసం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ సమాజ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలు, నిస్సహాయులకు తన వంతు సహాయం చేయడమే జన్మదిన వేడుకలకు నిజమైన అర్థమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను, కుటుంబాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పునీత్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags: