Repo Rate : బిగ్ అలర్ట్.. మీకు హోమ్ లోన్, కార్ లోన్ ఉంటే రిలీఫ్.. RBI తాజా ప్రకటన ఇదే
Repo Rate : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతిష్టాత్మక ద్రవ్య పరపతి సమీక్షా కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం..
Repo-Rate
Repo Rate : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతిష్టాత్మక ద్రవ్య పరపతి సమీక్షా కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ప్రపంచ ఆర్థిక సవాళ్ల మధ్య ఈ సమావేశం జరగడంతో దేశవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కీలక తరుణంలో ఆర్‌బీఐ ఊహించని విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
రెపో రేటు యథాతథం.. మారని వడ్డీ రేట్లు
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన ప్రకారం.. ఈసారి రెపో రేటు (Repo Rate) లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత రెపో రేటును 5.25% వద్దే యథాతథంగా ఉంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. MPC కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఓటు వేశారు. దీంతో పాటు మార్కెట్ పట్ల ఆర్‌బీఐ తన న్యూట్రల్ వైఖరిని కొనసాగిస్తోందని ప్రకటించారు. రెపో రేటు మారకపోవడంతో సామాన్యుల బ్యాంకు రుణాలు, ఈఎమ్ఐలపై ప్రస్తుతానికి ఎలాంటి అదనపు భారం పడదు.
జీడీపీ అంచనాల్లో కోత
పశ్చిమ ఆసియా యుద్ధ సంక్షోభం భారత్‌తో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు (జీడీపీ) అంచనాలను ఆర్‌బీఐ సవరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY27) భారత నిజమైన జీడీపీ (Real GDP) వృద్ధి రేటు 6.6% గా ఉండవచ్చని అంచనా వేసింది. గతంలో ఈ వృద్ధి రేటు 6.9% గా ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా దానిని తగ్గించక తప్పలేదు.
హౌస్‌హోల్డ్స్ కొనుగోలు శక్తిపై ద్రవ్యోల్బణం దెబ్బ
దేశంలో సేవల రంగం పుంజుకోవడం, జీఎస్టీ హేతుబద్ధీకరణ, స్థిరమైన ఉపాధి అవకాశాలు వంటివి పట్టణ ప్రాంతాల్లో వినియోగాన్ని పెంచుతున్నాయని గవర్నర్ తెలిపారు. అయితే, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న షాక్‌ల మధ్య కూడా ప్రస్తుతానికి వినియోగదారుల ధరల సూచీ (CPI) ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మూడో త్రైమాసికం (Q3) నాటికి ఇది గరిష్ట స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ అంచనా వేసింది.
భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న సవాళ్లు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ వ్యాపార మార్గాలు, సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. దీనివల్ల చమురు ధరలు పెరగడం, దిగుమతుల ఖర్చు భారం కావడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటికి తోడు దేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయనే అంచనాలు, 'ఎల్ నినో' ప్రభావం వల్ల ఆహార ఉత్పత్తుల ధరలపై కన్ఫ్యూజన్ కొనసాగుతోందని గవర్నర్ వివరించారు.
తట్టుకుని నిలబడతాం: గవర్నర్ ధీమా
ఇన్ని సవాళ్లు, అంతర్జాతీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, పటిష్టంగా ఉంటూ ఈ సంక్షోభాలను తట్టుకుని నిలబడిందని సంజయ్ మల్హోత్రా కొనియాడారు. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి అవాంతరాలనైనా కనీస నష్టంతో ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను కేవలం ఎదుర్కోవడమే కాకుండా, మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే అవకాశంగా మలచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.