Month Salary: ఇకపై నెలకు కాదు.. వారానికోసారి జీతం..!

Month Salary: నెలకి ఒకసారి కాకుండా రెండుసార్లు జీతం ఇస్తే ఎలా ఉంటుంది?

Update: 2026-06-06 01:45 GMT

Month Salary: ఇకపై నెలకు కాదు.. వారానికోసారి జీతం..!

Anupam Mittal : నెల తిరిగేసరికి అకౌంట్‌లో శాలరీ పడిందా.. లేదా? ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి గుండె చప్పుడు ఇది. ఒకటో తేదీ రాగానే మొబైల్‌కు వచ్చే Salary Credited అనే మెసేజ్ ఇచ్చే కిక్కే వేరు. కానీ, ఆ సంతోషం వారం రోజులు కూడా ఉండట్లేదు. ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, గ్రాసరీస్.. ఇలా అన్నీ అయిపోయేసరికి మొదటి వారంలోనే జేబు ఖాళీ అయిపోతుంది. మళ్లీ వచ్చే నెల ఒకటో తేదీ వరకు చేతిలో పైసల్లేక నానా అవస్థలు పడాల్సి వస్తుంది. సరిగ్గా ఈ మధ్యతరగతి కష్టాలపైనే 'షాదీ.కామ్' వ్యవస్థాపకుడు, ట్యాండ్ ఇండియా జడ్జి అనుపమ్ మిట్టల్ ఒక ఆసక్తికరమైన చర్చను తెరపైకి తెచ్చారు. నెలకి ఒకసారి కాకుండా.. రెండుసార్లు జీతం ఇస్తే ఎలా ఉంటుంది? అని ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

చాలా కంపెనీలు తమ ఆఫీసుల్లో ఉచిత భోజనం, ఫ్లెక్సిబుల్ పని వేళలు, గేమింగ్ జోన్లు ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకుంటాయని.. కానీ ఉద్యోగికి అత్యంత కీలకమైన సమయానికి జీతం ఇవ్వడం అనే విషయాన్ని విస్మరిస్తాయని అనుపమ్ మిట్టల్ మండిపడ్డారు. భారతదేశంలో చాలా కంపెనీలు నెల ముగిసిన తర్వాత తదుపరి వారంలో ఎప్పుడో ఒకప్పుడు జీతాలు వేస్తుంటాయి. బ్యాంక్ హాలిడేస్ సాకులు చెప్తుంటాయి. కానీ దీనివల్ల ఉద్యోగుల ఈఎంఐలు బౌన్స్ అవుతాయని, క్యాష్ ఫ్లో అనేది ఉద్యోగి గౌరవానికి సంబంధించిన విషయమని ఆయన స్పష్టం చేశారు. తమ 'షాదీ.కామ్'లో ప్రస్తుత నెల జీతాన్ని ఆ నెల ఆఖరి రోజే ఉద్యోగుల అకౌంట్లలో వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రతీ నెల 15వ తేదీన 50%, 30వ తేదీన మిగిలిన 50%) జీతాలు ఇచ్చే విధానాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. నెల మధ్యలో డబ్బులు లేక క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం తప్పుతుంది. ప్రజల చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉండటం వల్ల మార్కెట్లో కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వారానికి ఒకసారి లేదా రెండు వారాలకోసారి జీతాలు ఇచ్చే పద్ధతి విజయవంతంగా సాగుతోంది. అనుపమ్ మిట్టల్ ఆలోచన వినడానికి భలే బాగున్నా.. భారతీయ పరిస్థితుల్లో దీనిని అమలు చేయడం అంత సులువు కాదని ఆర్థిక నిపుణులు ,కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. వారి ప్రకారం సమస్య జీతం వచ్చే సమయంలో లేదు.. మన ఖర్చు చేసే విధానంలో ఉంది.

ఆర్థిక క్రమశిక్షణ లోపించడం: నెలలో ఒకేసారి ఇచ్చే జీతాన్ని రెండు ముక్కలు చేసి ఇచ్చినంత మాత్రాన ఉద్యోగుల్లో పొదుపు ఆలోచన రాదు. ఉదాహరణకు రూ. 60,000 జీతం వచ్చే వ్యక్తికి మొదటి రోజే రూ. 30,000 ఖర్చు చేసే అలవాటు ఉంటే.. అతనికి రూ. 30,000 ఇస్తే, అందులో రూ. 15,000 మొదటి రోజే ఖర్చు చేసి మిగతా సగం నెల కోసం మళ్లీ అప్పులు చేస్తాడు. ఇక్కడ సమస్య జీతం వచ్చే ఫ్రీక్వెన్సీ కాదు. డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోవడం, ఉద్యోగుల జీతాలు పెరగకపోవడమే అసలు సమస్య. నెలకు రెండుసార్లు శాలరీలు ప్రాసెస్ చేయడం వల్ల కంపెనీల హెచ్ఆర్, అకౌంట్స్ విభాగాలపై పనిభారం, నిర్వహణ ఖర్చులు రెట్టింపు అవుతాయి.

పాశ్చాత్య దేశాల సంస్కృతిని భారత్‌కు పరిచయం చేయాలనే అనుపమ్ మిట్టల్ ఆలోచన అభ్యుదయకరమైనదే అనడంలో సందేహం లేదు. సమయానికి జీతం ఇవ్వడం అనేది ఉద్యోగి హక్కు. అయితే, జీతం నెలకి రెండుసార్లు ఇవ్వడం కంటే.. ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వడం, ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కల్పించడం, కచ్చితంగా నెల ఆఖరి రోజో లేదా ఒకటో తేదీనో జీతం పడేలా చూడటమే ప్రస్తుతానికి భారతీయ కార్పొరేట్ రంగానికి అత్యంత అవసరమైన విషయం.

Tags:    

Similar News