PM SVANidhi: మీ ద‌గ్గ‌ర ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ. 90 వేల వ‌ర‌కు లోన్ పొందొచ్చు

PM SVANidhi: చిన్న వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నపీఎం స్వ‌నిధి పథకం ఆర్థికంగా ఉప‌యోగ‌ప‌డుతంది.

Update: 2026-08-14 07:54 GMT

 PM SVANidhi: మీ ద‌గ్గ‌ర ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ. 90 వేల వ‌ర‌కు లోన్ పొందొచ్చు

PM SVANidhi: చిన్న వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నపీఎం స్వ‌నిధి పథకం ఆర్థికంగా ఉప‌యోగ‌ప‌డుతంది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ఎలాంటి హామీ లేదా ఆస్తిని తాకట్టు పెట్టకుండా విడతల వారీగా రుణం అందుతుంది. ఈ ప‌థ‌కానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు చూద్దాం.

2030 వరకు కొనసాగనున్న పథకం

కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 జూన్‌లో పీఎం స్వ‌నిధి పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పథకం 2030 మార్చి 31 వరకు కొనసాగనుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 75.5 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకంతో అనుసంధానమయ్యారు.

వారికి 1.12 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.17,800 కోట్లకు పైగా ఉంది. అలాగే 55 లక్షల మందికి పైగా లబ్ధిదారులు డిజిటల్ చెల్లింపులతో అనుసంధానమయ్యారు. డిజిటల్ క్యాష్‌బ్యాక్, వడ్డీ రాయితీ వంటి ప్రయోజనాల రూపంలో లబ్ధిదారులకు సుమారు రూ.800 కోట్ల మేర ప్రయోజనం లభించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

మూడు విడతల్లో రూ.90,000 వరకు రుణం

పీఎం స్వ‌నిధి పథకంలో రుణాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తారు. గతంలో ఉన్న రుణ పరిమితిని పెంచి గరిష్ఠంగా రూ.90,000 వరకు పొందే అవకాశం కల్పించారు. మొద‌టి విడ‌త‌లో రూ. 15 వేల రుణం అందిస్తారు. రెండో విడ‌త‌లో రూ. 25 వేలు, మూడో విడ‌తలో రూ. 50,000 రుణం పొందొచ్చు.

మొదటి రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత తదుపరి విడతకు అర్హత లభిస్తుంది. అంటే రెండో విడత పొందాలంటే మొదటి రుణాన్ని సక్రమంగా చెల్లించాలి. అదే విధంగా మూడో విడతకు రెండో రుణం చెల్లింపు రికార్డు కీలకం. ఈ రుణానికి సాధారణంగా ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్న మొత్తాల్లో EMIల ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.

రుణంతో పాటు క్రెడిట్ కార్డు, క్యాష్‌బ్యాక్

PM SVANidhi పథకం ద్వారా రుణం పొందడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అర్హత నిబంధనలు పూర్తి చేసిన లబ్ధిదారులకు UPIకి అనుసంధానించిన RuPay క్రెడిట్ కార్డు అందించే అవకాశం ఉంది. రెండో విడత రుణాన్ని సకాలంలో చెల్లించిన లబ్ధిదారులు రూ.30,000 వరకు పరిమితి ఉన్న క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హత సాధించవచ్చు.

అలాగే డిజిటల్ పేమెంట్లు చేసే వీధి వ్యాపారులకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దీంతో నగదు లావాదేవీలకు బదులుగా UPI వంటి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే పథకం లక్ష్యం.

ఎలా దరఖాస్తు చేయాలంటే.?

పీఎం స్వ‌నిధి రుణం కోసం అర్హులైన వీధి వ్యాపారులు బ్యాంకులు లేదా పథకంతో లింక్ అయిన‌ రుణ సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు అవసరం. అయితే ఆధార్ కార్డు ఒక్కటే ఉంటే ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా రూ.90,000 రుణం వస్తుందని భావించకూడదు.

అర్హత, వ్యాపారం వివరాలు, రుణ చెల్లింపు చరిత్ర వంటి నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత సంస్థ వివరాలను పరిశీలిస్తుంది. అర్హత నిర్ధారణ అయిన తర్వాత రుణం మంజూరు చేస్తారు. ముఖ్యంగా, మొదటి విడత రుణాన్ని సకాలంలో చెల్లించడం ద్వారా తదుపరి విడతలకు అర్హత పొందే అవకాశం ఉంటుంది.

గమనిక: రుణ పరిమితి, పత్రాలు, వడ్డీ రాయితీ, క్రెడిట్ కార్డు అర్హత వంటి నిబంధనలు కాలానుగుణంగా మారవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు అధికారిక PM SVANidhi/బ్యాంకు నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

Tags:    

Similar News