LPG Cylinder: సామాన్యుడికి తగ్గనున్న భారం.. గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు

LPG Cylinder: దేశంలో వంటగ్యాస్ కొరతను నివారించేందుకు 2027 నాటికి 15 శాతం ఎల్‌పీజీని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2026-08-14 01:38 GMT

LPG Cylinder

LPG Cylinder: దేశంలో వంటగ్యాస్ కొరత తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలకు కేంద్రం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 2027 నాటికి దేశానికి అవసరమయ్యే మొత్తం ఎల్‌పీజీ దిగుమతుల్లో కనీసం 15 శాతాన్ని అమెరికా నుంచి ధీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా దిగుమతి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్ అమెరికాతో తొలిసారిగా దాదాపు 22 లక్షల టన్నుల ఎల్‌పీజీ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోగా, ఇప్పుడు ఆ దిగుమతులను మరింత పెంచేందుకు ప్రభుత్వ చమురు సంస్థల ఉన్నతాధికారులు అమెరికాలో చర్చలు జరుపుతున్నారు.

మిడిల్ ఈస్ట్‌పై తగ్గుతున్న ఆధారపడటం

ఇంతకాలం భారత్ తన ఎల్‌పీజీ అవసరాల కోసం 90 శాతానికి పైగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడేది. అయితే ఇటీవల ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, హోర్ముజ్ జలసంధిలో ఎదురవుతున్న రవాణా ఆటంకాల వల్ల దేశంలో వంటగ్యాస్ విపరీతమైన కొరతను ఎదుర్కొంది. ఈ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న భారత ప్రభుత్వం, కేవలం ఒక్క ప్రాంతంపైనే ఆధారపడకుండా గ్యాస్ సరఫరా మూలాలను వైవిధ్యపరచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అమెరికా వైపు అడుగులు వేసింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి అమెరికా ఇప్పటికే భారత్‌కు అతిపెద్ద ఎల్‌పీజీ సరఫరాదారుగా అవతరించింది. అక్కడ నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 39 లక్షల టన్నుల గ్యాస్ భారత్‌కు చేరుకుంది.

అమెరికాతో వాణిజ్య సంబంధాలు, ఇంధన భద్రత

అమెరికాతో ఎల్‌పీజీ కొనుగోలు ఒప్పందాలు పెంచుకోవడం వల్ల భారత్‌కు దౌత్యపరంగా కూడా లబ్ధి చేకూరనుంది. వాషింగ్టన్‌తో భారత్‌కు ఉన్న ట్రేడ్ సర్ప్లస్‌ను తగ్గించడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది. ట్రంప్ యంత్రాంగం కూడా భారత్‌కు తమ ఇంధన ఎగుమతులను పెంచాలని చాలా కాలంగా ఒత్తిడి తెస్తోంది. కాగా, ఈ వాణిజ్య చర్చలు సుదీర్ఘకాలంగా సాగుతున్నప్పటికీ, ఇంధన భద్రత దృష్ట్యా అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతులను పెంచేందుకు చమురు కంపెనీలు త్వరలోనే ఉమ్మడి టెండర్‌ను కూడా జారీ చేయనున్నాయి.

సామాన్యుడిపై కొరత భారం, హెచ్చుతగ్గుల ధరలు

మరోవైపు హోర్ముజ్ జలసంధి వివాదం ముదరడంతో గతేడాదితో పోలిస్తే గత నెలలో ఎల్‌పీజీ వినియోగం ఏకంగా 16 శాతం పడిపోయి 23.5 లక్షల టన్నులకు పరిమితమైంది. సిలిండర్ల కొరత కారణంగా అనేక గృహాలు, పరిశ్రమలు పీఎన్జీ వైపు లేదా పర్యావరణానికి హాని చేసే కిరోసిన్, ఇతర ఇంధనాల వైపు మళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం దేశంలో సిలిండర్ ధరలు తీవ్రమైన వ్యత్యాసాలతో ఉన్నాయి. ఉదాహరణకు లేహ్‌లో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1119 కాగా, ఢిల్లీలో రూ.942, రాంచీలో రూ.999.50, హైదరాబాదులో 994గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.2738 ఉంటే, రాంచీలో రూ.2922 వరకు ఉన్నాయి.

Tags:    

Similar News