Online fraud: ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలు..ఫ్లిప్‌కార్ట్‌పైనే అధికంగా!

Online fraud: ఈ-కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై గతేడాది 5.11 లక్షలకు పైగా ఫిర్యాదులు అందినట్లు కేంద్రం వెల్లడించింది.

Update: 2026-08-13 03:15 GMT

Online fraud: ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలు..ఫ్లిప్‌కార్ట్‌పైనే అధికంగా!

Online fraud: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. క్షణాల్లో నచ్చిన వస్తువును ఆర్డర్ చేసేస్తున్నాం. కానీ, ఆన్‌లైన్ షాపింగ్ ఎంత సౌకర్యవంతంగా మారిందో, వినియోగదారులకు అన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది. తాజాగా పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ-కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల అసలు బండారాన్ని బయటపెట్టాయి.

గడిచిన ఏడాది కాలంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఏకంగా 5.11 లక్షలకు పైగా ఫిర్యాదులు అందినట్లు కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ పార్లమెంట్‌లో వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి, వినియోగదారులను మోసం చేసిన 47 సంస్థలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ద్వారా రూ.1.12 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపారు.

ఆర్డర్ పెట్టి డబ్బులు చెల్లించినా వస్తువులు చేరకపోవడమే అతిపెద్ద సమస్యగా మారింది. ఈ ఒక్క సమస్యపైనే అత్యధికంగా 79,818 ఫిర్యాదులు వచ్చాయి. బుక్ చేసిన వస్తువుకు బదులు వేరే ప్రొడక్ట్ రావడం, నాణ్యత లేని లేదా డ్యామేజ్ అయిన వస్తువులు పంపడం. డ్యామేజ్ వస్తువులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించడం, రీప్లేస్‌మెంట్ చేయకపోవడం, రిఫండ్ డబ్బులను సకాలంలో ఖాతాలో జమ చేయకపోవడం.

కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చిన ఫిర్యాదుల జాబితా ఈ క్రింది విధంగా ఉంది.

ఫ్లిప్‌కార్ట్ : 1,33,000 ఫిర్యాదులు (అత్యధికం)

అమేజాన్ : 91,248 ఫిర్యాదులు

మీషో : 29,284 ఫిర్యాదులు

మింత్రా : 25,384 ఫిర్యాదులు

నెట్‌మెడ్స్ : 19,895 ఫిర్యాదులు

జెప్టో : 5,774 ఫిర్యాదులు

బ్లింకిట్: 5,102 ఫిర్యాదులు

నాప్టాల్ : 4,079 ఫిర్యాదులు

వీఎల్ఈ బజార్ & నైకా : చెరో 3,405 ఫిర్యాదులు

ఆన్‌లైన్ సంస్థల వల్ల మోసపోయిన సామాన్య వినియోగదారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం 'నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్' ద్వారా ముందస్తు పరిష్కారాన్ని అందిస్తోంది. కొనుగోలుదారులు మోసపోతే వెంటనే కన్జూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించి తమ హక్కులను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News