8వ వేతన సంఘం రిపోర్ట్ ఎప్పుడు రానుంది.? సిఫార్సులు ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.?
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులపై తాజాగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
8వ వేతన సంఘం రిపోర్ట్ ఎప్పుడు రానుంది.? సిఫార్సులు ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.?
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులపై తాజాగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో మార్పులకు సంబంధించిన సిఫార్సులను ఈ కమిషన్ కేంద్రానికి అందించాల్సి ఉంది. అయితే నివేదిక ఎప్పుడు వస్తుంది? 18 నెలల గడువు ఎప్పటితో ముగుస్తుంది? ఇప్పటికే కమిషన్ నివేదిక ఇచ్చిందా? వంటి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
8వ వేతన సంఘం 18 నెలల గడువు ఎప్పటితో ముగుస్తుంది?
8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) అధికారికంగా 2025 నవంబర్ 3న ఏర్పాటైంది. కమిషన్‌కు తన సిఫార్సులను అందించేందుకు మొత్తం 18 నెలల గడువు ఇచ్చారు. ఈ లెక్క ప్రకారం 18 నెలల గడువు 2027 మేలో ముగియనుంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన అధికారిక కాలపరిమితి ఇదే. అంతకంటే ముందే కమిషన్ నివేదిక ఇస్తుందని కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అందువల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం మే 2027ను కీలక గడువుగా చూడాల్సి ఉంటుంది.
నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది?
ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో 8వ వేతన సంఘంపై స్పష్టత ఇచ్చింది. కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లో తన సిఫార్సులను అందిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
అయితే కమిషన్ 18 నెలల గడువు కంటే ముందే నివేదిక సమర్పిస్తుందా? అనే విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ప్రస్తుతం 2027 మేలోపు సిఫార్సులు రావాల్సి ఉంటుందన్నది మాత్రమే అధికారికంగా ఉన్న సమాచారం. అలాగే కమిషన్ తన పురోగతిపై కేంద్రానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. తన విధివిధానాలను కమిషన్‌కు అప్పగించిన బాధ్యతలు, నిబంధనలకు అనుగుణంగా స్వయంగా నిర్ణయించుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం కమిషన్ ఏం చేస్తోంది?
8వ వేతన సంఘం ప్రస్తుతం సంప్రదింపుల దశలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్ల సంఘాలు, ఇతర సంబంధిత వర్గాలతో కమిషన్ చర్చలు నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగులు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను సేకరించే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. జైపూర్, చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్ వంటి నగరాల్లో సంప్రదింపులు నిర్వహించనున్నారు. ఈ అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లకు సంబంధించి కమిషన్ తన సిఫార్సులను రూపొందించనుంది.
8వ వేతన సంఘం పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి?
8వ వేతన సంఘం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పలు ఆర్థిక అంశాలను పరిశీలించనుంది. ఇందులో ముఖ్యంగా వేతన సవరణ, డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇతర అలవెన్సులు, పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ వంటి అంశాలు ఉన్నాయి. ఉద్యోగుల సేవా నిబంధనలకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా కమిషన్ పరిశీలించి సిఫార్సులు చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? పెన్షనర్లకు ఎంత ప్రయోజనం లభిస్తుంది? వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తుది వివరాలను ప్రకటించలేదు.
ఎంతమంది ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం పడొచ్చు?
8వ వేతన సంఘం సిఫార్సుల ప్రభావం సుమారు 70 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై ఉండొచ్చని అంచనా. 2026 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ సివిలియన్ ఉద్యోగులు సుమారు 35.77 లక్షల మంది ఉన్నారు. 2025 డిసెంబర్ 31 నాటికి పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు కలిపి సుమారు 33.76 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. ఈ పెన్షనర్ల సంఖ్యలో రక్షణ శాఖ పెన్షనర్లు లేరు.
అయితే కొత్త వేతనాలు, పెన్షన్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? అనే విషయంపై కేంద్రం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు. కమిషన్ సిఫార్సులు సమర్పించిన తర్వాత వాటిని ప్రభుత్వం పరిశీలించి, అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం 2027 మే నెలే 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ప్రధానంగా గమనించాల్సిన గడువు అని తెలుస్తోంది.