Google: గూగుల్ గుట్టు రట్టు .. ఎంత మోసం చేశారు..!
Google: డిజిటల్ యాడ్స్ వ్యాపారంలో గూగుల్ అనుసరిస్తున్న కీవర్డ్ విధానంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Google: గూగుల్ గుట్టు రట్టు .. ఎంత మోసం చేశారు..!
Delhi High: మీరు గూగుల్‌లో హిండ్‌వేర్ శానిటరీ సామాగ్రి కోసం సెర్చ్ చేశారనుకోండి. తీరా చూస్తే పైన ప్రకటనల్లో వేరే ఏవో కంపెనీల పేర్లు కనిపిస్తాయి. ఏంటి, నేను కొట్టింది హిండ్‌వేర్ కదా.. ఇవేంటి వేరే బ్రాండ్లు వస్తున్నాయి? అని కాసేపు కన్ఫ్యూజ్ అవుతారు కదూ? సరిగ్గా ఈ డిజిటల్ మాయాజాలం వెనుక ఉన్న గూగుల్ గుట్టును రట్టు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ప్రముఖ శానిటరీవేర్ సంస్థ హిండ్‌వేర్ దాఖలు చేసిన కేసులో గూగుల్ కంపెనీకి కోర్టు రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. డిజిటల్ యాడ్స్ రంగంలో ఇదొక సంచలనంగా మారింది.
వ్యాపార ప్రపంచంలో గూగుల్ యాడ్స్ ఒక పెద్ద బ్రహ్మాస్త్రం. ఇక్కడ కీవర్డ్స్ వేలం పాట జరుగుతుంది. హిండ్‌వేర్ ఆరోపణల ప్రకారం.. ఎవరైనా యూజర్లు గూగుల్‌లో హిండ్‌వేర్ శానిటరీ, హిండ్‌వేర్ శానిటరీ వేర్ అని సెర్చ్ చేసినప్పుడు, హిండ్‌వేర్ కంటే ముందే తమ ప్రకటనలు కనిపించేలా పోటీ కంపెనీలు ఆ బ్రాండ్ పేరును కీవర్డ్‌గా కొనుగోలు చేశాయి.
దీనికి గూగుల్ కూడా సహకరించి, సదరు బ్రాండ్ పేరును వేరే వాళ్లకు కీవర్డ్‌గా అమ్ముకుంది. దీనివల్ల ఏమైంది? హిండ్‌వేర్ కోసం వెతికిన కస్టమర్లు పొరపాటున వేరే బ్రాండ్ వైపు వెళ్లే ప్రమాదం ఏర్పడింది. హిండ్‌వేర్ ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న బ్రాండ్ విలువను, నమ్మకాన్ని వేరే కంపెనీలు పైసా ఖర్చు లేకుండా వాణిజ్యపరంగా వాడేసుకున్నాయి.
ఒక సంస్థకు చెందిన రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ను, వారి అనుమతి లేకుండా పోటీదారులకు అడ్వర్టైజ్‌మెంట్ కీవర్డ్‌గా విక్రయించడం వ్యాపార నైతికతకే విరుద్ధం. ఇది ట్రేడ్‌మార్క్ హక్కులను స్పష్టంగా ఉల్లంఘించడమే అని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది.
ఈ తీర్పు కేవలం హిండ్‌వేర్, గూగుల్ మధ్య నడిచిన గొడవ మాత్రమే కాదు. భవిష్యత్తులో ఆన్‌లైన్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే అంశం. ఇకపై పెద్ద పెద్ద కంపెనీల పేర్లను వాడుకుని, గూగుల్ యాడ్స్ ద్వారా కస్టమర్లను పక్కదారి పట్టిస్తామంటే కుదరదు.
బ్రాండ్ నేమ్స్ ఉన్న కంపెనీలకు ఈ తీర్పు కొండంత అండగా నిలుస్తుంది. కేవలం డబ్బులు వస్తున్నాయి కదా అని ఎవరి ట్రేడ్‌మార్క్‌లను పడితే వాళ్లకు కీవర్డ్స్‌గా అమ్మేయడానికి వీల్లేదని గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు కోర్టు గట్టి సందేశం పంపింది.
భవిష్యత్తులో ఆన్‌లైన్ యాడ్స్ ప్లాట్‌ఫామ్‌లు కీవర్డ్స్ కేటాయించేటప్పుడు మరింత జాగ్రత్తగా, నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. డిజిటల్ ప్రపంచంలో కీవర్డ్ అనేది ఒక డిజిటల్ ఆస్తి లాంటిది. ఇన్నాళ్లూ గూగుల్ సామ్రాజ్యంలో సాగిన ఈ కీవర్డ్స్ వ్యాపారానికి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఒక బ్రేక్ వేసిందనే చెప్పాలి. ఇకనైనా ఆన్‌లైన్ ప్రకటనల్లో నైతికత పెరుగుతుందేమో చూడాలి.