Bank Auction: బ్యాంకులు వేలం పాట పెట్టిన ఆస్తులు కొనడం మంచిదేనా.? కచ్చితంగా తెలుసుకోండి

Bank Auction: బ్యాంకు వేలంలో మార్కెట్ ధర కంటే తక్కువకే ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.?

Update: 2026-06-06 09:33 GMT

Bank Auction: బ్యాంకులు వేలం పాట పెట్టిన ఆస్తులు కొనడం మంచిదేనా.? కచ్చితంగా తెలుసుకోండి

Bank Auction: సొంత ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ ధరల నేపథ్యంలో అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కానీ, మార్కెట్ రేట్ల కంటే దాదాపు 15 నుండి 20 శాతం తక్కువ ధరకు ఆస్తులను సొంతం చేసుకునే ఒక అవకాశం 'బ్యాంకు వేలం'.

ఎవరైనా బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైతే.. బ్యాంకులు సర్ఫేసీ చట్టం కింద ఆయా ఆస్తులను జప్తు చేసి బహిరంగ వేలం వేస్తాయి. మరి ఈ ఆస్తులను మనం ఎలా కొనుగోలు చేయాలి? దీని వెనుక ఉన్న పూర్తి ప్రక్రియ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా బ్యాంకులు ఏదైనా ఆస్తిని వేలం వేసే ముందు ప్రముఖ పత్రికల్లో 'ఈ-వేలం' నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 'ఐబాపి' పోర్టల్‌లో లేదా ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లలో(ఉదాహరణకు: SBI mega e-auction)వేలం వేసే ఆస్తుల పూర్తి జాబితా, వేలం తేదీ, సమయం తదితర వివరాలను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

వేలంలో పాల్గొనే ప్రక్రియ ఇది: రిజిస్ట్రేషన్: ఆన్‌లైన్‌లో ప్రాపర్టీ నచ్చిన తర్వాత, ముందుగా వేలం నిర్వహించే పోర్టల్‌లో మీ వివరాలతో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి.

EMD చెల్లింపు: వేలంలో పాల్గొనాలంటే ఆ ఆస్తికి బ్యాంకు నిర్ణయించిన రిజర్వ్ ధరలో 10 శాతం మొత్తాన్ని 'ఎర్నెస్ట్ మనీ డిపాజిట్' రూపంలో ముందుగానే ఆన్‌లైన్‌లో లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి.

KYC సమర్పణ: మీరు అప్లై చేస్తున్న ఆస్తికి సంబంధించి మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి KYC పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

ఆన్‌లైన్ బిడ్డింగ్: వేలం నిర్వహించే నిర్దిష్ట రోజున, సమయానికి ఆన్‌లైన్‌లో లాగిన్ అయి బిడ్డింగ్ వేయాలి. ఎవరైతే అత్యధిక ధర కోట్ చేస్తారో ఆ ఆస్తి వారికే దక్కుతుంది.

వేలంలో గెలిస్తే ఏం చేయాలి?

మీరు వేలంలో పాల్గొని అత్యధిక ధర వెచ్చించి ఆస్తిని దక్కించుకున్నట్లయితే, మీరు కోట్ చేసిన మొత్తంలో 25 శాతం డబ్బును 24 గంటలలోపు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 75 శాతం డబ్బును బ్యాంకు నిబంధనలను బట్టి 15 నుండి 30 రోజుల్లోపు కట్టాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి ఆస్తి మీ పేరు మీదకు మారుతుంది.

కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రత్యక్ష పరిశీలన: ఆన్‌లైన్‌లో కేవలం ఫోటోలు లేదా వివరాలు చూసి గుడ్డిగా డబ్బులు కట్టేయకూడదు. బ్యాంకులు ముందే ఒక తేదీని ఇస్తాయి, ఆ రోజున నేరుగా వెళ్లి ఆస్తి భౌతికంగా ఎలా ఉందో పరిశీలించాలి.

పొసెషన్ పరిస్థితి: బ్యాంకు ఆస్తిని కేవలం 'సింబాలిక్ పొసెషన్' తీసుకుందా లేక 'ఫిజికల్ పొసెషన్' తీసుకుందా అనేది చాలా ముఖ్యం. ఫిజికల్ పొసెషన్ ఉన్న ఆస్తులను కొనడమే ఎప్పుడూ సురక్షితం.

పెండింగ్ బకాయిలు చెక్ చేయాలి: ఆ ఇంటిపై గత యజమాని చెల్లించని కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్, లేదా సొసైటీ మెయింటెనెన్స్ బకాయిలు ఏమైనా ఉన్నాయేమో ముందే మున్సిపల్ ఆఫీసులో ఆరా తీయాలి.

తక్కువ ధరకు వస్తుంది కదా అని ఆదరాబాదరాగా కాకుండా, పై జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఒక మంచి న్యాయవాది సలహాతో డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బ్యాంకు వేలంలో ఆస్తిని కొనుగోలు చేయడం ఉత్తమం.

Tags:    

Similar News