Toyota Innova Hycross : E20 కాదు.. అసలు కారణం ఇదే.. టొయోటా క్లారిటీ..
Toyota Innova Hycross : బీహార్‌కు చెందిన ఒక టొయోటా ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్‌గా మారడంతో, ఈ వ్యవహారంపై
Toyota Innova Hycross
Toyota Innova Hycross : బీహార్‌కు చెందిన ఒక టొయోటా ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్‌గా మారడంతో, ఈ వ్యవహారంపై టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) అధికారికంగా స్పందించింది. వాహనంలో తలెత్తిన సమస్యకు ఈ20 (E20) పెట్రోల్ కారణం కాదని, కల్తీ , నాణ్యత లేని ఇంధనం వల్లే ఈ సమస్య వచ్చిందని సంస్థ స్పష్టం చేసింది.
అసలు వివాదం ఏమిటి?
సదరు కస్టమర్ తన ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఎంపీవీ వాహనాన్ని దాదాపు 12,000 కిలోమీటర్లు నడిపిన తర్వాత, ఇంజిన్‌లో తీవ్రమైన వైబ్రేషన్స్ (వణుకు), నాకింగ్ , బ్రేక్‌డౌన్ వంటి సమస్యలు వచ్చాయని పేర్కొంటూ రెండు వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఈ20 పెట్రోల్ వాడటం వల్లే తన కారు ఇంధన వ్యవస్థ దెబ్బతిన్నదని, వాహనం నుండి సేకరించిన ఇంధన శాంపిల్స్‌లో ఇథనాల్ శాతం అసాధారణంగా ఉందని అతను ఆరోపించారు. టొయోటా సర్వీస్ సెంటర్‌లో రికార్డ్ చేసిన రెండో వీడియోలో, కారు ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ పంప్‌ను విప్పి చూపిస్తూ, ట్యాంక్‌లోని వేర్వేరు భాగాల నుండి సేకరించిన పెట్రోల్ వేర్వేరు రంగుల్లో ఉందని, అందులో స్పష్టంగా మురికి కనిపిస్తోందని సదరు యజమాని వాదించాడు. కారు ఫ్యూయల్ క్యాప్‌పై "Up to E20 Petrol" అని స్పష్టంగా రాసి ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎందుకు రావాలని, ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ పాలసీపై అతను అసంతృప్తి వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించాడు.
టొయోటా సాంకేతిక తనిఖీ , స్పష్టత
ఈ ఆరోపణలను టొయోటా సంస్థ పూర్తిగా తోసిపుచ్చింది. తమ ఇన్నోవా హైక్రాస్ వాహనం ఈ20 పెట్రోల్‌కు పూర్తిగా అనుకూలంగా ఉండేలా డిజైన్ చేయబడిందని, అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకుని సర్టిఫికేషన్ పొందిందని స్పష్టం చేసింది. వైరల్ వీడియోపై స్పందిస్తూ.. కంపెనీ నిపుణులు ఆ వాహనాన్ని క్షుణ్ణంగా సాంకేతిక పరిశీలన చేశారని, ఈ తనిఖీల్లో కారు ఇంధన వ్యవస్థకు కానీ, ఇతర విడిభాగాలకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని తేలిందని కంపెనీ పేర్కొంది.
సమస్యకు పరిష్కారం
స్టాండర్డ్ సర్వీస్ విధానంలో భాగంగా, టొయోటా టెక్నీషియన్లు ఆ కారు ఫ్యూయల్ ట్యాంక్ , ఫ్యూయల్ లైన్లలో ఉన్న కల్తీ ఇంధనాన్ని పూర్తిగా తొలగించి, క్లీన్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రామాణికమైన ఈ20 ఇంధనాన్ని నింపగా, వాహనం ఎటువంటి సమస్యలు లేకుండా సాధారణ స్థితిలో పనిచేసిందని, ఆపై కారును కస్టమర్‌కు అప్పగించామని టొయోటా తెలిపింది. ఈ మొత్తం వ్యవహారానికి "ఈ20 ఇంధన వినియోగంతో ఎటువంటి సంబంధం లేదు" అని, ఇది కేవలం నాణ్యత లేని, కల్తీ పెట్రోల్ వల్లే జరిగిందని సంస్థ తేల్చి చెప్పింది.
వాహనదారులకు టొయోటా సూచన
ఇలాంటి ఇంధన కల్తీ సమస్యల బారిన పడకుండా ఉండటానికి కస్టమర్లు ఎల్లప్పుడూ గుర్తింపు పొందిన, నమ్మకమైన అధీకృత పెట్రోల్ బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకోవాలని టొయోటా సూచించింది. తక్కువ నాణ్యత గల ఇంధనం వాహన పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఈ20 ఇంధన అనుకూలతపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, సైన్స్ ఆధారిత అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, ఏవైనా సందేహాలుంటే నేరుగా టొయోటా డీలర్‌షిప్‌లను సంప్రదించాలని కోరింది.