Rajampeta: వెలుగులోకి 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు!

Rajampeta: కడప జిల్లా రాజంపేట బుడ్డాయ్యపల్లె పొలాల్లో 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు లభ్యమైంది.

Update: 2026-04-12 11:28 GMT

Rajampeta: వెలుగులోకి 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు!

Rajampeta: కడప రాజంపేట సర్కిల్ వైయస్సార్ విగ్రహం నుంచి అర కిలోమీటర్ దూరంలోని బుడ్డాయ్యపల్లె పొలాల్లో 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు వెలుగులోకి వచ్చినట్లు రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు.

సిద్ధవటం ఎల్లారెడ్డి, మిడుతూరు వెన్నపూస ఓబుల్ రెడ్డి అందించిన సమాచారంతో పరిశోధన చేసిన ఆయన, ఈ ప్రాంతం పూర్వం ఒక వ్యూహాత్మక మార్గమని, ఇక్కడ జరిగిన స్థానిక ఘర్షణలో మరణించిన వీరుని స్మృత్యర్థం దీనిని ప్రతిష్టించారని వివరించారు. శిల్పశైలి, వస్త్రధారణలను బట్టి ఇది విజయనగర కాలానికి చెందినదిగా గుర్తించారు.

శిల్ప విశేషాలు:

మధ్యలో ఉన్న వీరుడు తన రెండు పాదాలను కుడివైపునకు తిప్పి ఏకముఖపాదవిన్యాసంలో ఉన్నాడని తెలిపారు. ఇది ఆయనలోని శౌర్యాన్ని, యుద్ధ యాత్రను సూచిస్తోందన్నారు. వీరుని ముఖం కొంత ఛిద్రమైనా, తలపై కేశబంధం(నడితల పైకి ఎత్తిన వెంట్రుకల ముడి), చెవులకు లోలాకులు, నడుము నుంచి పాదాల వరకు వస్త్రధారణ, ఎడమ చేతిని ఎడమవైపు కిందికి ఉంచినట్లు, కుడి చేతిలో ఒక ఖడ్గం ధరించి కింది వైపుకు పట్టుకున్నట్లు అద్భుతంగా శిల్ఫీకరించారు

సతుల వర్ణన:

కుడివైపు సతి: సమపాద స్థానకంలో నిలబడి ఉందని తెలిపారు. తలపై కుంతలం (తల మీద అందంగా పూ మొగ్గ వలె మధ్యకు కానీ, పక్కకు కానీ అమర్చబడిన అలంకారం), పెద్ద లోలాకులు, సన్నని నడుముతో శిల్పి ఆమెను అత్యంత సుందరంగా మలిచారు. ఈమె కుడి చేతిలో కలశం, ఎడమ చేతిలో కమల మొగ్గ ధరించి ఉందని చెప్పారు.

ఎడమవైపు సతి: ఈమె అర్ధవైతస్థితిక స్థానకంలో (కుడి పాదం కుడి వైపుకు, ఎడమ పాదం నేరుగా) నిలబడి ఉందని తెలిపారు. తన కుడి చేతిని నడుము కింద ఆనించి కటిహస్త ముద్రలో ఉండటం భర్త పట్ల ఆమెకున్న అచంచల నిశ్చయాన్ని చాటుతోందని చెప్పారు. ఈ కటిహస్త శైలి విజయనగర శిల్పకళలో అత్యంత ప్రాచుర్యం పొందినది. చేతులలో కంకణాలు, కేయూరాలున్నాయని వివరించారు.

పైభాగంలో వీరుడికి, సతులకు పైన అందమైన తోరణాలు (ప్రభావళి) చెక్కబడి ఉన్నాయని తెలిపారు. ఇవి ఆ వీరుడు వీరమరణం పొంది దైవత్వాన్ని పొందాడని సూచిస్తున్నాయని చెప్పారు.

ఈ వీరగల్లు ఆనాటి సామాజిక ఆచారాలకు, వీరత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని రమేష్ వెల్లడించారు.

Tags:    

Similar News