East Godavari: ఆసుపత్రిలో అగ్నికీలలు.. మంటలు ఆర్పే క్రమంలో ఫైర్ మ్యాన్ అస్వస్థత

East Godavari: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం. మెడిసిన్ స్టోర్ రూమ్‌లో చెలరేగిన మంటలు. రూ. 15 లక్షల విలువైన మందులు దగ్ధం.

Update: 2026-04-08 05:29 GMT

East Godavari: ఆసుపత్రిలో అగ్నికీలలు.. మంటలు ఆర్పే క్రమంలో ఫైర్ మ్యాన్ అస్వస్థత

తూర్పు గోదావరి జిల్లా: నల్లజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ ఆసుపత్రి)లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి మెడిసిన్ స్టోర్ రూమ్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు.

మొదట ఫైర్ గన్స్ ఉపయోగించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, స్టోర్‌లో ఉన్న ఔషధ సీసాలు ఒక్కొక్కటిగా పేలడంతో మంటలు మరింతగా చెలరేగాయి.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. మంటలు ఆర్పే క్రమంలో ఔషధ సీసాలు పేలిపోవడంతో ఒక ఫైర్ మ్యాన్ స్పృహ తప్పి కిందపడినట్లు సమాచారం. వెంటనే అతనికి వైద్య సహాయం అందించారు.

ఈ ప్రమాదంలో ఆసుపత్రిలోని విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఇటీవల మందుల కొరత నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చిన ప్రత్యేక ఔషధాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం సుమారు రూ.15 లక్షల విలువైన మెడిసిన్ కాలిబూడిదైనట్లు అధికారులు తెలిపారు.

అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో పేషెంట్లు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ప్రాణ నష్టం జరిగే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News