Amaravati: గ్యాస్ కొరత కేవలం వదంతే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి!
Amaravati: అమరావతి రాజధానిలో హెచ్‌ఓడీ టవర్-3 నిర్మాణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు.
Amaravati: గ్యాస్ కొరత కేవలం వదంతే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి!
Amaravati: రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందన్న ప్రచారాలపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతుల కారణంగా కొందరు ముందుగానే గ్యాస్ బుకింగ్స్ చేసుకుంటున్నారని, దీని వల్ల రోజువారీ బుకింగ్స్ సంఖ్య అనూహ్యంగా పెరిగిందని తెలిపారు. సాధారణంగా రోజుకు సుమారు 2.4 లక్షల గ్యాస్ బుకింగ్స్ ఉండగా, ప్రస్తుతం అవి 5 లక్షలకు చేరుకున్నాయని పేర్కొన్నారు.
ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని మంత్రి సూచించారు. గ్యాస్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ సరఫరా విస్తరణపై ఇప్పటికే క్యాబినెట్ స్థాయిలో చర్చలు జరిగాయని, త్వరలోనే కొత్త పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు.
వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 10 నుంచి 20 శాతం వరకు పెంచినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా రెస్టారెంట్లు, విద్యాసంస్థలకు ఎక్కడైనా కొరత తలెత్తితే వెంటనే సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో సరఫరాను మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇక పట్టణాల్లో పైప్డ్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2.34 లక్షల మంది పైప్డ్ గ్యాస్ వినియోగిస్తున్నారని తెలిపారు. ఇంటింటికీ పైప్డ్ గ్యాస్ అందించేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రజలు పైప్డ్ గ్యాస్ కనెక్షన్ల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.
గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అక్రమాలపై ఇప్పటికే 800 కేసులు నమోదు చేసి, 3540 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అధిక ధరలకు విక్రయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరా ప్రక్రియలో వన్ టైం పాస్‌వర్డ్ విధానాన్ని తప్పనిసరి చేశామని, అర్హత లేని వారికి సిలిండర్లు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అలాగే, హోటళ్లలో వంట నూనెల ధరలు పెరుగుతున్నాయన్న సమాచారం తమకు అందిందని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మంత్రి చెప్పారు. ధరలు అధికంగా ఉంటే ప్రజలు రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నంబర్ 1967 లేదా జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
పెట్రోల్, డీజిల్ సరఫరాలో కూడా ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసిన మంత్రి, డీలిమిటేషన్ అంశంపై పార్టీ స్థాయిలో సబ్ కమిటీ ఏర్పాటు చేసి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. మొత్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.