Ambati Rambabu: అమరావతి ముగియని కథ.. రాజధానిపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు!

Ambati Rambabu: అమరావతి నిర్మాణం అసాధ్యమన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ అభివృద్ధికి మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (మావిగన్) కారిడారే సరైనదని వెల్లడి.

Update: 2026-04-04 05:45 GMT

Ambati Rambabu: అమరావతి ముగియని కథ.. రాజధానిపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు!

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదని, అది ఒక ముగియని కథ అని ఆయన అభివర్ణించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మాజీ మంత్రి విడదల రజని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రూ. 2 లక్షల కోట్లు భారం:

రాజధాని అభివృద్ధికి దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా చెబుతున్నారని, అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించడం రాష్ట్రానికి పెనుభారంగా మారుతుందని అంబటి విమర్శించారు. "అమరావతి ఎప్పటికీ పూర్తయ్యే పథకం కాదు. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా వర్షం వస్తే నిండిపోయే చెరువులాంటి గుంతలో రాజధానిని కడతారా?" అని ఆయన ప్రశ్నించారు.

'మావిగన్' మంత్రం:

అమరావతికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (MAVIGAN) కారిడార్‌ను అంబటి ప్రతిపాదించారు. కేవలం రూ. 20 వేల కోట్లతో ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. అమరావతి కేవలం 217 చదరపు కిలోమీటర్లకే పరిమితమని, కానీ మావిగన్ ప్రాంతం 60 లక్షల జనాభాతో ఇప్పటికే అభివృద్ధి చెంది ఉందని వివరించారు.

చట్టంపై సవాల్:

పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై స్పందిస్తూ.. "రాజధాని పరిరక్షణకు చట్టం తెచ్చామని చెబుతున్నారు. రేపు మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని మార్చలేరా?" అని అంబటి వ్యాఖ్యానించారు. రాజధానిపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న హడావుడిని ఆయన తప్పుబట్టారు.

Tags:    

Similar News