Puttaparthi: వెట్టిచాకిరీ నుంచి 40 మంది కార్మికులకు విముక్తి!
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లాలో 40 మంది వెట్టి కార్మికులకు విముక్తి. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో మహారాష్ట్రకు చెందిన కార్మికులకు రక్షణ.
Puttaparthi: వెట్టిచాకిరీ నుంచి 40 మంది కార్మికులకు విముక్తి!
Puttaparthi: ఆధునిక వెట్టిచాకిరీ విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు అధికారులు వేగవంతంగా స్పందించి, అమానుష స్థితిలో సాగుతున్న బొగ్గు భట్టీల నరకం నుంచి మహారాష్ట్రకు చెందిన 40 మంది పేద కార్మికులను సురక్షితంగా కాపాడి వారికి స్వేచ్ఛాయుత జీవితాన్ని ప్రసాదించారు.
అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన కాంట్రాక్టర్, చదువురాని అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన 40 మంది కార్మికులను దారుణంగా మోసగించాడు. అప్పుల ఊబిలోకి దించి, శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కొత్తచెరువు మండలం తలమర్ల, గోరంట్ల ప్రాంతాల సమీపంలో సాగుతున్న బొగ్గు తయారీ లాంటి అత్యంత ప్రమాదకరమైన పనుల్లోకి వీరిని బలవంతంగా నెట్టాడు.చీకటి కొట్టులాంటి బతుకులు కనీస మానవ హక్కులు లేక, విద్యుత్ సౌకర్యం, శౌచాలయాలు కూడా లేని అపరిశుభ్ర వాతావరణంలో ఈ కుటుంబాలు అల్లాడిపోయాయి. తీవ్రమైన వేడి, ఊపిరాడని పొగ మధ్య రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నప్పటికీ, వారి శ్రమను దోచుకుంటూ వారిని బాండెడ్ లేబర్‌గా మార్చేశారు.
బాండెడ్ లేబర్ వ్యవస్థపై విశ్వసనీయ సమాచారం అందుకున్న కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తక్షణమే స్పందించారు. రెవెన్యూ, పోలీస్, కార్మిక శాఖల ప్రత్యేక బృందాలతో తలమర్ల, గోరంట్ల పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి బాధితులందరికీ విముక్తి కల్పించారు. 'వెట్టిచాకిరీ నిరోధక చట్టం' కింద బాధితులందరికీ విడుదల పత్రాలు పంపిణీ చేశారు. వారిపై కాంట్రాక్టర్ మోపిన అక్రమ రుణాలను పూర్తిగా రద్దు చేశారు.బాధితులకు తక్షణమే భోజన వసతి, వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రయాణ ఖర్చుల నిమిత్తం తగిన ఆర్థిక సహాయాన్ని అందించారు.
ప్రత్యేక వాహనాల ద్వారా 40 మంది కార్మికులను సురక్షితంగా వారి స్వరాష్ట్రమైన మహారాష్ట్ర (రాయ్‌గఢ్ జిల్లా)కు పంపించే ఏర్పాటు చేశారు. బాధితుల ఆనంద భాష్పాలు స్వగ్రామాలకు పయనమవుతున్న సమయంలో జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర భావోద్వేగ వాతావరణం నెలకొంది. "మా అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్ మమ్మల్ని దారుణంగా మోసం చేశాడు. ఎలాంటి సౌకర్యాలు లేని చీకటి ప్రపంచంలో మగ్గిపోతున్న మమ్మల్ని ఏపీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు కాపాడి కొత్త జీవితాన్ని ఇచ్చారు" అని బాధితులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అక్రమ రవాణా, వెట్టిచాకిరీకి కారణమైన మహారాష్ట్ర అహ్మద్‌నగర్ కాంట్రాక్టర్‌తో పాటు, స్థానికంగా సహకరించిన వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన కేసులు నమోదు చేసినట్లు, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని అధికారులు స్పష్టం చేశారు.