Anantapur: తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన అనంతపురం నూతన మేయర్ రమేష్ గౌడ్

అనంతపురం: అనంతపురం నగర నూతన మేయర్‌గా ఎన్నికైన సి. రమేష్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రమేష్ గౌడ్‌కు జగన్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.ఈ సందర్భంగా అనంతపురం నగర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని జగన్ సూచించారు.

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.అధికార కూటమి ఎన్ని కుట్రలు, ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచిన అనంతపురం నగర ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని జగన్ పేర్కొన్నారు.

అనంతరం రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మేయర్‌గా అవకాశం కల్పించిన వైఎస్ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, నగర ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.మేయర్‌గా తనకు లభించిన అవకాశాన్ని బాధ్యతగా భావించి ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులతో పాటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, సాకే శైలజానాథ్, తలారి రంగయ్య, నరేష్ కుమార్ రెడ్డి తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Tags: