Puttaparthi: పుట్టపర్తిలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్!

Puttaparthi: దేశ స్వాతంత్ర్యోద్యమంతో పాటు విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని పుట్టపర్తిలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశంలో ఆధునిక విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఐఐటీలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధితో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటుకు బలమైన పునాదులు వేశారని గుర్తు చేశారు.

కులమతాలకు అతీతంగా జాతీయ సమైక్యతను కాంక్షించిన ఆయన, విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని విశ్వసించిన గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రీసర్వే ఏడీ విజయశాంతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు.

Tags: