Amaravati: ఏపీ పురావస్తు శాఖ కమిషనర్‌గా ఐఏఎస్ ముత్యాలరాజు బాధ్యతలు!
Amaravati: ఏపీ పురావస్తు శాఖ, మ్యూజియంల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ ముత్యాలరాజు మంత్రి కందుల దుర్గేష్‌ను కలిశారు.
Amaravati: ఏపీ పురావస్తు శాఖ కమిషనర్‌గా ఐఏఎస్ ముత్యాలరాజు బాధ్యతలు!
Amaravati: ఆంధ్రప్రదేశ్ పురావస్తు సంపద, చారిత్రక కట్టడాలు, ప్రాచీన కళాఖండాలు, శాసనాలు, మ్యూజియంలకు మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర పురాతత్వ శాఖ, మ్యూజియంల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు.. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముత్యాలరాజుకు మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని పురావస్తు సంపద పరిరక్షణ, చారిత్రక కట్టడాల సంరక్షణ, మ్యూజియంల అభివృద్ధిపై ఇరువురూ చర్చించారు. వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న పురావస్తు ఆధారాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రకు, సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే అనేక పురాతన కట్టడాలు, శాసనాలు, శిల్పాలు, కళాఖండాలు ఉన్నాయి. వీటి సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పురావస్తు శాఖను మరింత క్రియాశీలకంగా మార్చడంతో పాటు, చారిత్రక ప్రదేశాలను పర్యాటక కేంద్రాలతో అనుసంధానించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు మన వారసత్వంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలను ఆధునీకరించడంపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి సందర్శకులను ఆకట్టుకునేలా మ్యూజియంలను తీర్చిదిద్దాలని సూచించారు. డిజిటల్ ప్రదర్శనలు, మెరుగైన వసతులు, చారిత్రక సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో అందించే విధానాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
మంత్రి సూచనలపై కమిషనర్ రేవు ముత్యాలరాజు స్పందిస్తూ.. రాష్ట్రంలోని పురావస్తు సంపదను పరిరక్షించడంతో పాటు మ్యూజియంల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు. చరిత్రను కాపాడుతూ.. భవిష్యత్ తరాలకు ఆంధ్రప్రదేశ్ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.